Punjab Elections.. బీజేపీలో చేరిన బాలీవుడ్ హీరోయిన్.. భర్తతోపాటు కాషాయ తీర్థం
బాలీవుడ్‌లో యువ హీరోయిన్ మహీ గిల్ సంచలన నిర్ణయం తీసుకొన్నది. పంజాబ్ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో తన భర్త, పంజాబీ సినీ నటుడు హాబ్బీ ధలీవాల్‌తో కలిసి బీజేపీలో చేరారు. హబ్బీ ధలీవాల్, మహీ గిల్ బీజేపీలో చేరడం పంజాబ్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
బీజేపీలో చేరడంపై మహీ గిల్ మాట్లాడుతూ.. పంజాబ్‌లోని మహిళలు, యువతులకు ఏదైనా మంచి చేయాలనే ఆలోచనలో ఉన్నాను. అలా మహిళలకు మంచి చేసే అవకాశం ఉన్న పార్టీ బీజేపీ అని భావించాను. మహిళల సాధికారితకు కట్టుబడి ఉన్న బీజేపీలో చేరడం జరిగింది అని మహీ గిల్ చెప్పారు.
బీజేపీలో చేరి నా జన్మభూమికి, నా రాష్ట్రానికి సేవ చేయాలని అనుకొంటున్నాను. మళ్లీ నా సొంత గూటికి చేరినట్టు ఫీల్ అవుతున్నాను. నా ప్రజలకు, రాష్ట్రానికి సేవ చేయాలని అనుకొన్నప్పుడు బీజేపీ కంటే మరో మంచి పార్టీ లేదనిపించింది.
మహీ గిల్ భర్త హబ్బీ ధలీవాల్ మాట్లాడుతూ.. పంజాబ్ సంక్షేమానికి, అభివృద్ధి కోసం నరేంద్రమోడీ తపిస్తున్న తీరు.. ఆయన విజన్ నాకు బాగా స్పూర్తిని కలిగిస్తున్నది అని అన్నారు. మహీ గిల్, హబ్బీ చేరికను హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ ఖట్టర్ స్వాగతించారు.హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ ఖట్టర్ మాట్లాడుతూ.. పంజాబ్‌లో బీజేపీ గాలి బాగా వీస్తున్నది. పంజాబ్‌లో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.

పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను చూసి చాలా మంది బీజేపీలో చేరడానికి ఆకర్షితులవుతున్నారు. మిగితా పార్టీల తీరు చూసి అందరూ విసుగు చెందిన పరిస్థితి ఉంది. పంజాబ్‌లో అవినీతి, మాఫియా రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించాలంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించాల్సిందే అని అన్నారు.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ దివాళా తీసిన పరిస్థితి ఉంది. రాష్ట్రంలో సీఎం పదవి కోసం ఎవరిపేరైనా చెబితే వారి చుట్టు అవినీతి కనిపిస్తున్నది. ఇసుక మాఫియాలో కాంగ్రెస్ నేతలు కూరుకుపోయారు అని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ ఖట్టర్ అన్నారు.
మహీ గిల్ సినిమా కెరీర్ విషయానికి వస్తే.. హవాయీయేన్ చిత్రం ద్వారా 2003లో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఆ తర్వాత కొయ కొయా చాంద్, దేవ్ డీ, దంబాంగ్, సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్‌స్టర్, పాన్ సింగ్ తోమార్, దబాంగ్ 2, సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్‌స్టర్ రిటర్న్స్, జంజీర్, బుల్లెట్ రాజా, సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్‌స్టర్ 3, దుర్గామతి లాంటి చిత్రాల్లో నటించింది. అఫ్రాన్, ఫిక్సర్, పాగల్ లోక్, యువర్ హానర్ అనే వెబ్ సిరీస్‌లో నటించింది.


Click it and Unblock the Notifications











