ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. లెజెండరీ నటుడు ధర్మేంద్ర కన్నుమూత..
Dharmendra: బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర (89) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈ వెటరన్ స్టార్ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తోంది. ఈ విషయం చిత్ర దర్శకుడు కరణ్ జోహార్ ధృవీకరించారు. దీంతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ దుఃఖసంద్రంలో మునిగిపోయింది. ఇటీవలే ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన ఆరోగ్యం కుదుటపడినట్టు కనిపించినా, మరోసారి అకస్మాత్తుగా క్షీణించడం అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది.
ధర్మేంద్ర ముంబైలోని జుహూ నివాసంలో ఉన్నప్పుడే ఆయన ఆరోగ్యం మళ్లీ విషమించింది. ఇంట్లోనే లైఫ్ సపోర్ట్ ఏర్పాటు చేసి చికిత్స కొనసాగించినప్పటికీ, ఆయన ఆరోగ్య పరిస్థితి బాగుచేయలేకపోయారు. తెల్లవారు జామున ఆయన నివాసం వద్ద అంబులెన్స్ కనిపించడంతో వార్తలు వేగంగా పాకాయి. కొద్ది సేపటికే ఆయన మరణించినట్లు కుటుంబ వర్గాలు ధృవీకరించాయి. బయట బారికేడ్లు ఏర్పాటుచేయడం, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో దుఃఖ వాతావరణం నెలకొంది.

ఇక నటుడు ధర్మేంద్రకు ఇద్దరు భార్యలు హేమ మాలిని, ప్రకాష్ కౌర్, కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్, కుమార్తెలు ఇషా డియోల్, అహానా డియోల్ ఉన్నారు. గుండె, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆయన ఆరోగ్యం గత కొన్ని నెలలుగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. తాజాగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో తీవ్ర అనారోగ్యానికి గురై చేరినప్పటికీ చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు.
అయితే మళ్లీ శరీరం సహకరించకపోవడంతో ఇంట్లోనే వైద్యుల పర్యవేక్షణలో ఉన్న సమయంలో ఆయన తుదిశ్వాస విడిచినట్టు సమాచారం.ధర్మేంద్ర మరణ వార్తతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని నింపింది. పలువురు బాలీవుడ్ ప్రముఖులు, సన్నిహితులు ధర్మేంద్ర ముంబై నివాసానికి చేరుకుంటోన్నారు. ఇంటి వెలుపల విషాదకర వాతావరణం నెలకొంది. అభిమానులు కూడా తమ ఆరాధ్య నటుడికి చివరి వీడ్కోలు పలకడానికి భారీగా తరలివస్తోన్నారు.
1950లలో సినీ రంగంలో అడుగుపెట్టిన ధర్మేంద్ర తన యాక్టింగ్‌తో ప్రేక్షకులను అబ్బురపరిచారు. అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్, సహజమైన నటనతో ఆకట్టుకున్నారు. యాక్షన్, రొమాన్స్, కామెడీ, భావోద్వేగంతో తనదైన ముద్ర వేశారు. బాలీవుడ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన 'షోలే' మూవీలో ఆయన పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. 'ఫూల్ ఔర్ పత్థర్', 'చుప్కే చుప్కే', 'సత్యకామ్', 'సీతా ఔర్ గీత', 'యాదోన్ కి బారాత్' వంటి అనేక క్లాసిక్ సినిమాలు ఆయన కెరీర్‌లో మైల్ స్టోన్ నిలిచాయి. నిలిచాయి.
ఈ విషాద వార్తతో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బాలీవుడ్ ప్రముఖులు కన్నీటి నివాళి అర్పిస్తున్నారు. అభిమానులు చివరి వీడ్కోలు పలుకుతూ శోకసంద్రంలో మునిగిపోయారు. కొన్ని తరాలకు పైగా అభిమానులను ఆకట్టుకున్న ఈ లెజెండరీ నటుడి మరణంతో బాలీవుడ్ లో ఒక యుగానికి తెరపడినట్టు అయింది. ధర్మేంద్ర పేరు భారతీయ సినిమాకు ఎప్పటికీ చిరస్మరణీయమే.


Click it and Unblock the Notifications











