తల్లి కాబోతోన్న కియారా అద్వానీ.. వాటితో హింట్, హీరోయిన్ పోస్ట్ వైరల్
ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో సినీ నటుల ప్రేమలు, పెళ్లిళ్లు కొనసాగుతున్నాయి. టాలీవుడ్ టూ బాలీవుడ్ ఏ ఇండస్ట్రీ చూసినా శుభకార్యాలతో కళకళలాడుతున్నాయి. అలాగే పలువురు స్టార్ హీరోయిన్స్ గర్భం దాలుస్తూ ఈ ఆనందాన్ని మరింత రెట్టింపు చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్, బాలీవుడ్‌లలో క్రేజీ హీరోయిన్‌గా ఉన్న కియారా అద్వానీ శుభవార్త చెప్పారు. ఈ వివరాల్లోకి వెళితే..
ముంబైకి చెందిన కియారా అద్వానీ .. ఫగ్లీ సినిమాతో 2013లో సినీ రంగంలో అడుగుపెట్టారు. ఆ తర్వాత ఎంఎస్ ధోనీ బయోపిక్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సరసన నటించి దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. అనంతరం మెషిన్, లస్ట్ స్టోరీస్, కళంక్, కబీర్ సింగ్, గుడ్ న్యూజ్, గుల్టీ, లక్ష్మీ, ఇందూకీ జవానీ, షేర్షా, భూల్ భూలయా 2, గోవింద నామ్ మేరా, సత్యప్రేమ్ కీ కథ వంటి చిత్రాలతో బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు.

ఇక కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా వచ్చిన భరత్ అనే నేనుతో తెలుగు వారిని పలకరించారు కియారా అద్వానీ. అనంతరం రామ్‌చరణ్‌తో వినయ విధేయ రామ, గేమ్ ఛేంజర్ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ యశ్ సరసన కన్నడంలో టాక్సిక్ : ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్‌లో, హృతిక్ రోషన్ సరసన వార్ 2లో నటిస్తున్నారు కియారా. ఇవికాక పలు మ్యూజిక్ వీడియోలు, వెబ్ సిరీస్‌లలో కియారా నటించారు.
షేర్షా సినిమా షూటింగ్ సమయంలో బాలీవుడ్ యువ హీరో సిద్ధార్ధ్ మల్హోత్రాతో పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరూ కొంతకాలం పాటు డేటింగ్ చేయడంతో పాటు తమ ప్రేమను గుట్టుగా ఉంచారు. పలు టీవీ షోలు, ఇంటర్వ్యూలలో జంటగా పాల్గొన్నప్పటికీ తమ ప్రేమను బహిర్గతం చేయలేదు. ఈ నేపథ్యంలో తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు రెండేళ్ల క్రితం అనౌన్స్ చేసి అభిమానులకు షాకిచ్చింది ఈ జంట. అనంతరం 2023 ఫిబ్రవరిలో రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఉన్న సూర్యఘర్ ప్యాలస్‌లో సిద్ధార్థ్ - కియారాల వివాహం ఘనంగా జరిగింది. వీరి వివాహానికి సినీ, రాజకీయ, క్రీడా తదితర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఆ తర్వాత ముంబైలో సినీ ప్రముఖులు, అభిమానుల కోసం గ్రాండ్ పార్టీ ఇచ్చారు.
పెళ్లయి రెండేళ్లు గడుస్తున్నా కియారా - సిద్ధార్థ్‌లు ఇంకా శుభవార్త చెప్పకపోవడంతో వారి అభిమానులు, సినీ ప్రముఖులు పలుమార్లు వారిని సోషల్ మీడియాలో ప్రశ్నించారు. తాజాగా ఫిబ్రవరి 28న కియారా అద్వానీ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. భర్త సిద్ధార్ధ్ చేతిలో చేయి వేసి , చేతిలో బేబీ సాక్స్‌తో ఉన్న ఫోటోను కియారా షేర్ చేశారు. మా జీవితంలోకి అద్భుతమైన బహుమతి త్వరలో రాబోతోందని ఆమె రాసుకొచ్చింది. తద్వారా అఫీషియల్‌గా తాను గర్భం దాల్చినట్లు కియారా ప్రకటించినట్లయ్యింది. ఈ పోస్ట్ క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. హీరోయిన్లు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, రాశీ ఖన్నా సహా సినీ ప్రముఖులు, అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.


Click it and Unblock the Notifications











