చిరంజీవి ఆర్డర్ వేస్తే చాలు.. పరిగెత్తుకొస్తా : గిన్నిస్ ఈవెంట్‌లో అమీర్‌ఖాన్
నాలుగు దశాబ్ధాలకు పైగా తెలుగు చిత్ర పరిశ్రమను తన నటనతో అలరిస్తున్న మెగాస్టార్ చిరంజీవి కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ప్రపంచ ప్రఖ్యాత గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. 156 చిత్రాలు, 537 పాటలు, 24 వేల స్టెప్పులతో మరే నటుడికి సాధ్యం కానీ విధంగా అలరించినందుకు గాను ఆయనను ఈ పురస్కారం వరించింది. బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్ చేతుల మీదుగా ఆయనకు గిన్నిస్ రికార్డ్స్‌ను అందజేశారు.
ఈ సందర్భంగా చిరంజీవిపై ప్రశంసల వర్షం కురిపించారు అమీర్ ఖాన్. హైదరాబాద్‌కు రావడం ఆనందంగా ఉందని, మెగాస్టార్ అభిమానులను చూస్తే సంతోషంగా ఉందన్నారు. మీలో నన్ను కూడా చేర్చుకోవాలని.. నేను చిరంజీవికి పెద్ద అభిమానినని, ఆయనను అన్నయ్యలా భావిస్తానని అమీర్ ఖాన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా చిరు ఫోన్ చేసి చెప్పారని.. కానీ ఆయన ఆర్డర్ వేయాలి, అడగాల్సిన అవసరం లేదన్నారు.

చిరు గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించుకున్నందుకు తాను థ్రిల్ అయ్యానని.. ఈ అద్భుతమైన సాయంత్రాన్ని మీతో గడుపుతున్నానని అమీర్ ఖాన్ చెప్పారు. ఇక చిరంజీవి డ్యాన్స్‌పై బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ప్రశంసలు కురిపించారు. ఆయన పాటలను గమనిస్తే , చిరంజీవి మనసే అందులో కనిపిస్తుందని, డ్యాన్స్‌ని ఎంజాయ్ చేస్తూ వేస్తారని అమీర్ చెప్పారు.
అనంతరం చిరంజీవి మాట్లాడుతూ.. తాను ఫోన్ చేసి పిలవగానే అమీర్ హైదరాబాద్‌కు వచ్చారని తెలిపారు. గిన్నిస్ బుక్ రికార్డు తన కల్లో కూడా ఊహించలేదని.. దీనికి కారణమైన నా దర్శక, నిర్మాతలు , అభిమానులకు మెగాస్టార్ ధన్యవాదాలు చెప్పారు. డ్యాన్స్‌పై నాకున్న ఇంట్రెస్ట్ వల్ల గిన్నిస్ అవార్డ్ దక్కిందని చిరు అన్నారు. యువకుడిగా ఉన్నప్పుడు తనకు నటన కంటే డ్యాన్స్ అంటేనే ఇష్టమని .. రేడియోలో పాటలు వింటూ డ్యాన్స్ చేసేవాడినని మెగాస్టార్ గుర్తుచేసుకున్నారు.
ఎన్‌సీసీలో చేరాక.. భోజనం పూర్తయ్యాక ప్లేటును మోగిస్తూ స్టెప్పులు వేసేవాడినని వెల్లడించారు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత సావిత్రి, నరసింహారావు, రోజా రమణి తదితరులు తనను ప్రోత్సహించారని.. ఓ రోజున డ్యాన్స్ చేస్తుండగా కాలు స్లిప్ అయి కిందపడిపోయానని తెలిపారు. అందరూ షాక్ అవ్వగా.. తాను దానిని నాగిని డ్యాన్స్‌గా మార్చేశానని చిరు చెప్పారు. డ్యాన్సింగ్ స్కిల్ నాకు ఎంతో ఉపయోగపడిందని.. నా డ్యాన్స్ కోసం ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారని నాడు బడా డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్న లింగమూర్తి తనను దర్శక నిర్మాతలకు సిఫారసు చేశారని చిరంజీవి గుర్తుచేసుకున్నారు.
తన కోసం దర్శక , నిర్మాతలు, సంగీత దర్శకులు , కొరియోగ్రాఫర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారని .. అల్లు అరవింద్, అశ్శినీదత్‌లు పాటల విషయంలో బలవంతం చేశారని ఆయన నవ్వుతూ అన్నారు. ఈ కార్యక్రమంలో కే రాఘవేంద్రరావు, బీ గోపాల్, అల్లు అరవింద్, అశ్వినీదత్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, కోదండరామిరెడ్డి , కేఎస్ రామారావు తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











