తీవ్ర విషాదంలో బ్రహ్మనందం.. కోటను తలుచుకొని ఎక్కి ఎక్కి ఏడ్చిన లెజెండరీ కమెడియన్
తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక శకం ముగిసింది. తన అసమాన నటనతో దాదాపు నాలుగున్నర దశాబ్ధాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న దిగ్గజ నటుడు కోట శ్రీనివాసరావు ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జూలై 13న హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. విలన్‌గా, కమడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దాదాపు 750 సినిమాలలో నటించారు. రోటీన్ పాత్రలు పడుతున్నాయి అన్నుకున్నప్పుడల్లా తనను తాను మార్చుకుంటూ ఎన్నో మరుపురాని క్యారెక్టర్లు పోషించారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని మూడు తరాల నటులతో కలిసి నటించిన ఘనత ఆయనది.
తెలుగు హాస్య కుటుంబం దిగ్భ్రాంతి
కోట శ్రీనివాసరావు మరణంతో ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అన్నింటికి మించి తెలుగు హాస్య కుటుంబంలో సభ్యుడైన కోట శ్రీనివాసరావు ఇక లేరని తెలిసి సహచర హాస్య నటులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్, తనికెళ్ల భరణిలు ఒక జట్టుగా కలిసి మెలిసి ఉండేవారు. రోజులో ఖచ్చితంగా ఏదో ఒక సెట్‌లో కలవాల్సిందే. ముఖ్యంగా కోటా శ్రీనివాసరావు- బాబు మోహన్ జోడీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో చిత్రాల్లో ఈ జంట ప్రేక్షకుల్ని నవ్వించింది. ఈ జోడీని చూడటానికే ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లేవారంటే అతిశయోక్తి కాదు.

తెలుగు సినీ కోట కూలిపోయిందన్న భరణి
సినిమాలతో పాటు వీరు వ్యక్తిగతంగానూ స్నేహంగా మెలిగారు. ఒకరి కష్టసుఖాల్లో మరొకరు తోడుగా నిలిచేవారు. ఈ నేపథ్యంలో కోట శ్రీనివాసరావు తమను విడిచి వెళ్లిపోవడంతో తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, బాబు మోహన్‌లు భోరున విలపిస్తున్నారు. హైదరాబాద్‌లోని కోట నివాసానికి చేరుకుని ఆయన పార్ధివ దేహాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు. సినీ పరిశ్రమ కోట కూలిపోయిందని అన్నారు నటుడు, రచయిత తనికెళ్ల భరణి. కోట శ్రీనివాసరావుతో తనకు దశాబ్థాలుగా పరిచయం ఉందని, సామాన్య కుటుంబంలో పుట్టి అంచలంచెలుగా ఎదిగారని భరణి ప్రశంసించారు.
నేను రాకుండానే కోటన్న వెళ్లిపోయాడు
తన మిత్రుడు కోట శ్రీనివాసరావు మరణంతో బాబు మోహన్ కన్నీటి పర్యంతమయ్యారు. రెండు రాష్ట్రాల ప్రజలకంటే కోట తనకే ఎక్కువ ఆత్మీయుడన్నారు. సినిమాల్లోనే కాకుండా, బయట కూడా సరదాగా ఉండేవాళ్లమని.. రెండ్రోజు క్రితం కూడా తాను ఫోన్ చేసి మాట్లాడానని, ఇంటికి వస్తానని చెప్పానని, కానీ నేనొచ్చేసరికి కోటన్న వెళ్లిపోయాడని బాబు మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. షూటింగ్ సమయంలో అన్నం తినిపించేవాడని.. ఎక్కడ షూటింగ్ జరిగినా ఇద్దరం పక్కపక్కనే ఉండేవాళ్లమని బాబు మోహన్ గుర్తుచేసుకున్నారు.
అరేయ్ ఒరేయ్ అనుకునేవాళ్లం
ఇక దిగ్గజ కమెడియన్ బ్రహ్మానందం అయితే కోట శ్రీనివాసరావు భౌతిక కాయంపై పడి కన్నీటి పర్యంతమయ్యారు. కోటనే చూస్తూ అలా ఏడుస్తూ ఉండిపోయారు.. పక్కనే ఉన్న రాజేంద్రప్రసాద్, శివాజీ రాజా తదితరులు ఆయనను ఓదార్చారు. అనంతరం ఇంటి బయట మీడియాతో మాట్లాడుతూ కన్నీళ్లను ఆపుకోలేకపోయారు బ్రహ్మానందం. కోట మహానటుడు.. మేమిద్దరం కొన్ని వందల చిత్రాల్లో నటించాం.. ఒక దశకంలో నేను, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ ప్రతి సినిమాలో ఉండేవాళ్లమని రోజుకు 18 నుంచి 20 గంటలు పనిచేసేవాళ్లమని బ్రహ్మానందం గుర్తుచేసుకున్నారు. అరేయ్ ఒరేయ్ అనుకునేవాళ్లమని.. ఈరోజు కోట లేడంటే నమ్మలేకున్నా.. నటన ఉన్నంతకాలం కోట ఉంటాడు. ఏ విషయంపై అయినా నిర్మొహమాటంగా మాట్లాడే వ్యక్తని.. కోట లాంటి వ్యక్తిని కోల్పోవడం ఇండస్ట్రీకి, ఈ దేశానికే తీరని లోటని బ్రహ్మానందం కన్నీటి పర్యంతమయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











