Ustaad Bhagat Singh: పవన్‌తో ఆ అదృష్టం.. నేను డైరెక్టర్ అవ్వడానికి కారణం ఆయనే.. పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు
Ustaad Bhagat Singh Pre Release Event: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి పవర్ స్టార్ ఫీవర్ కనిపిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) సినిమా ఉగాది కానుకగా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీలోని పాటలు, ట్రైలర్ ప్రేక్షకుల నుంచి భారీ స్పందన పొందడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. సినిమా ప్రమోషన్స్ లో భాగం ఆదివారం ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.ఈ వేడుకలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు. ముఖ్యంగా దర్శకుడు బుచ్చిబాబు సనా (Buchi Babu Sana) చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించాయి.
హరీష్ శంకర్‌తో ప్రత్యేక అనుబంధం
ఈ సందర్భంగా బుచ్చిబాబు ముందుగా దర్శకుడు హరీష్ శంకర్ (Harish Shankar)తో ఉన్న తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తన తొలి చిత్రం ఉప్పెన భారీ విజయాన్ని సాధించిన తర్వాత ఎలాంటి సినిమాలు చేయాలనే సందిగ్ధంలో ఉన్నానని చెప్పారు. ఆ సమయంలో హరీష్ శంకర్ ఇచ్చిన ప్రోత్సాహం తనకు ఎంతో ఉపయోగపడిందని తెలిపారు. 'ఉప్పెన సినిమా తర్వాత నాకు దాదాపు ఐదేళ్ల గ్యాప్ వచ్చింది. ఆ సమయంలో హరీష్ శంకర్ గారు ఇచ్చిన మోటివేషన్ వల్లే నేను ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం పొందాను. మా గురువు సుకుమార్ గారి తర్వాత హరీష్ శంకర్ గారిని కూడా నా గురువుగా భావిస్తాను'అని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా హరీష్ శంకర్‌ను చూస్తే పవన్ కళ్యాణ్‌ను చూసినట్టే అనిపిస్తుందని చెప్పారు. 'మీ బాడీ లాంగ్వేజ్‌లో 50 శాతం పవన్ కళ్యాణ్ గారు ఉంటారు' అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.

పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ బుచ్చిబాబు ఎమోషనల్ అయ్యారు. 'నేను పుట్టింది పిఠాపురంలో. పవన్ కళ్యాణ్ గారు మా ఎమ్మెల్యే. ఇంతమంది మధ్య ఆ అదృష్టం అందరికీ ఉండకపోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు మా ఎమ్మెల్యే అని చెప్పుకునే అదృష్టం నాకు దక్కింది' అని అన్నారు. తన జీవితంలో పవన్ కళ్యాణ్ సినిమాలు ఎంత ప్రభావం చూపించాయో కూడా వివరించారు. ముఖ్యంగా తొలి ప్రేమ (Tholi Prema)సినిమా తనకు ఎంతో ప్రేరణ ఇచ్చిందని చెప్పారు.
'నేను కాకినాడలో ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో కిరణ్ అనే స్టూడెంట్ స్టేట్ టాపర్ అయ్యాడు. అందరూ అతనిని ఎంతో గౌరవంగా చూసేవారు. అతను మీ సినిమా చూసి మిమ్మల్ని ఎంతో పొగిడేవాడు. అతనికంటే పెద్దవాడిగా నిలవాలంటే నేను కూడా ఏదో పెద్ద పని చేయాలి అనిపించింది. అప్పుడు నేను డైరెక్టర్ అవ్వాలని నిర్ణయించుకున్నాను. తొలిప్రేమ సినిమా నాకు అంతటి ఇన్‌స్పిరేషన్ ఇచ్చింది' అని బుచ్చిబాబు తెలిపారు.
గబ్బర్ సింగ్ షూటింగ్‌లో సంఘటన
ఇంకా మాట్లాడుతూ ఒక ఆసక్తికర సంఘటనను కూడా గుర్తు చేసుకున్నారు. గబ్బర్ సింగ్ షూటింగ్ సమయంలో తాను తన గురువు సుకుమార్ దగ్గర అసిస్టెంట్‌గా పని చేస్తున్నానని చెప్పారు. 'ఒకసారి అక్కడ షూటింగ్ చూడడానికి వెళ్లాం. అప్పుడు అక్కడ వాళ్లు 'ఎవర్రా మీరు?' అని అడిగారు. మేము సుకుమార్ గారి అసిస్టెంట్స్ అని చెప్పకుండా 'పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్' అని చెప్పాం. వెంటనే షూటింగ్ చూడడానికి అనుమతి ఇచ్చారు. అప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులకు ఎంత గౌరవం ఉంటుందో నాకు అర్థమైంది'అని బుచ్చిబాబు చెప్పారు.
ఈ సందర్భంగా రామ్ చరణ్ గురించి కూడా బుచ్చిబాబు మాట్లాడారు. ఈ ఈవెంట్‌కు వస్తున్నానని రామ్ చరణ్‌కు చెప్పినప్పుడు ఆయన కూడా వెంటనే వెళ్లమని చెప్పారని తెలిపారు. 'రామ్ చరణ్ గారు కూడా నాతో చాలా విషయాలు పంచుకుంటారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారితో తనకు ఉన్న అనుబంధం గురించి చాలాసార్లు చెప్పారు. తన తండ్రి చిరంజీవి దగ్గర ఎంత నేర్చుకున్నారో, అంతకంటే వంద రెట్లు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నేర్చుకున్నానని రామ్ చరణ్ గారు చెప్పిన సందర్భాలు ఉన్నాయి' అని ఆయన వెల్లడించారు. మొత్తానికి ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బుచ్చిబాబు చేసిన ఈ వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ అభిమానులను ఆనందపరిచాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తన జీవితానికి ప్రేరణగా నిలిచారని చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











