Nani 'దసరా'కు సెన్సార్ బోర్డ్ షాక్.. రికార్డ్ స్థాయిలో అన్ని సీన్లు తొలగింపు.. ఆ పదాలకు మ్యూట్!
అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుకు పెట్టిన నాని అనుకోకుండా హీరోగా మారాడు. ఆ తర్వాత వరుస హిట్స్ ఇస్తూ మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకోవడంతోపాటు పక్కింటి కుర్రాడి వంటి పాత్రలతో నేచురల్ స్టార్ అయ్యాడు. సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా హీరోగా, నిర్మాతగా కొనసాగుతున్నాడు. ఇప్పుడు తాజాగా దసరా అనే మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇటీవలే హిట్ 2 మూవీతో నిర్మాతగా మంచి విజయం సాధించిన నాని.. ఇప్పుడు హీరోగా కూడా సూపర్ హిట్ కొడతానని చాలా నమ్మకంగా ఉన్నాడు. అయితే నాని దసరా సినిమా టీమ్ కు సెన్సార్ బోర్డ్ తాజాగా షాక్ ఇచ్చింది.

బొగ్గు గనుల నేపథ్యంలో..
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని గతేడాది హీరోగా అంటే సుందరానికి సినిమాతో అలరించాడు. ఇప్పుడు ఈ ఏడాది దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 90వ దశకం కాలంలో బొగ్గు గనుల నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో నాని మేకోవర్ చాలా డిఫరెంట్ గా ఉంది. అలాగే హీరోయిన్ కీర్తి సురేష్ కూడా డీ గ్లామర్ లుక్ లో వెన్నెల అనే పాత్రలో ఆకట్టుకోనుంది. న్యూ టాలెంటెడ్ ను ఎంకరేజ్ చేసే నాని ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదేలను డైరెక్టర్ గా పరిచయం చేశాడు.

తొలి చిత్రం..
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు అయిన శ్రీకాంత్ ఓదేల దర్శకత్వం వహించిన దసరా సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ ఒదేలకు ఇదే తొలి చిత్రం. అలాగే కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. అయితే ఈ సినిమాను నాని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా చెప్పుకొవచ్చు. రూ. 65 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన దసరా సినిమాకు ప్రిరిలీజ్ బిజినెస్ భారీగా జరిగిందని తెలుస్తోంది.

పాన్ ఇండియా మూవీగా..
దసరా చిత్రానికి పెట్టిన బడ్జెట్ కంటే థియేట్రికల్ బిజినెస్ ద్వారా వస్తున్న మొత్తం కాస్తా ఎక్కువగానే ఉన్నటలు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ మంచి మొత్తాన్ని రకవరీ చేసి సుమారు రూ. 10 కోట్లు లాభాలు పొందారని టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే నాని, కీర్తి సురేష్ రెండోసారి జంటగా నటించిన దసరా మూవీని పాన్ ఇండియా చిత్రంగా మార్చి 30 గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

జోరుగా ప్రమోషన్స్..
దసరా సినిమాను తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల చేస్తున్నారు. అందుకు తగినట్లుగానే పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇతర భాషల్లో దసరా చిత్ర బృందం జోరుగా ప్రచారం నిర్వహిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి విడుదలైన 'ఓరి వారి', 'చమ్కీల అంగేసి', 'ధూమ్ ధామ్ దోస్తాన్' వంటి పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ సినిమాకు ఇటీవలే సెన్సార్ బోర్డ్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

అక్కడ టెక్ట్స్ తీసేయాలని..
నాని, కీర్తి సురేష్ దసరా చిత్రానికి మార్చి 24న సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికేట్ జారీ చేసింది. అయితే ఈ సినిమాలో మొత్తం 16 సన్నివేశాలను తీసేశారట. ఆడియో మ్యూట్, డైలాగ్స్ కట్స్ అన్నీ కలిపి చూసుకుంటే మొత్తంగా 36 చోట్ల సన్నివేశాలుకు కోతకు గురైనట్లు సమాచారం. అంతేకాకుండా కొన్ని చోట్ల సబ్ టైటిల్స్ లో టెక్ట్స్ తీసేయాలని కూడా సెన్సార్ సభ్యులు కండిషన్ పెట్టారట. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనే హెచ్చరిక ఫాంట్ సైజ్ పెంచాల్సిందిగా చెప్పారట.

ఆ పదాలకు మ్యూట్..
ఇక తెలంగాణలోని వాడుక భాషలోని కొన్ని పదాలైన బద్దల్ బాసింగలైతయ్, బాడకవ్ వంటి పదాలను మ్యూట్ చేయాలని సెన్సార్ బోర్డ్ మెంబర్స్ అన్నట్లు తెలుస్తోంది. డైలాగ్స్, ధూమ్ ధామ్ దోస్తాన్ పాటలోని లిరిక్స్ కు అభ్యంతరం చెప్పారట. ఇలా ఇంత మొత్తంలో సెన్సార్ బోర్డ్ కట్స్ పెట్టిన విధంగా దసరా సినిమా రికార్డ్ క్రియేట్ చేసిందని పలువురు చెబుతున్నారు. కాగా ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి కీలక పాత్ర పోషించగా.. మలయాళం పాపులర్ యాక్టర్ షైన్ టామ్ చాకో విలన్ గా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











