మా నాన్న అలాంటివాడు కాదు.. ఎలా చనిపోయాడంటే? అందరికి అలా బాబాయ్‌లా.. రవిబాబు ఎమోషనల్
నటుడు, నిర్మాత చలపతిరావు ఇక లేరు. శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో గుండెపోటుతో కన్నుమూశారు. గత 6 దశాబ్దాల సినీ జీవితంలో 1200కిపైగా చిత్రాల్లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హాస్య నటుడిగా పలు పాత్రలు పోషించారు. చలపతిరావు మరణ వార్తతో తెలుగు సినీ లోకం దిగ్బ్రాంతికి గురైంది. తన తండ్రి మరణం గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి కుమారుడు, నటుడు, నిర్మాత, దర్శకుడు రవిబాబు స్పందిస్తూ...

నవ్వుతూ ఈ లోకం నుంచి..
అందరికి నమస్కారం. ఆదివారం 8 గంటలప్రాంతంలో మా నాన్నగారు చలపతిరావు కన్నుమూశారు. ఆయన జీవితంలో అందర్నీ ఎలా నవ్విస్తారో.. అలానే నవ్వుతూ అంతే సంతోషంతో వెళ్లిపోయారు. సాధారణంగా ఎవరైనా హఠాత్తుగా చనిపోతే కూర్చొని కూర్చొని వెళ్లిపోయారు అని అంటారుగా.. అలానే ఆయన ఈ లోకం నుంచి వెళ్లిపోయారు. భోజనం చేసి ప్లేట్ అలా పట్టుకొని సీట్లోనే వాలిపోయారు అని కుమారుడు, దర్శకుడు, నటుడు రవిబాబు తెలిపారు.

బుధవారం అంత్యక్రియలు నిర్వహిస్తాం
మా నాన్న చలపతిరావు గారి అంత్యక్రియలు ఆదివారం చేద్దామని అనుకొన్నాం. కానీ మా అక్కయ్యలు యూఎస్‌లో ఉంటారు. వారు అక్కడి నుంచి రావడానికి మంగళవారం ఉదయం కావొచ్చు. మంగళవారం అంత్యక్రియలు చేయవద్దని చెప్పారు. అందుకే బుధవారం అంత్యక్రియలు చేద్దామని అనుకొంటున్నాం. మధ్యాహ్నం మహాప్రస్థానంలోని ఫ్రీజర్‌లో నాన్నగారి భౌతికకాయాన్ని పెడుతాం అని రవిబాబు చెప్పారు.

మా నాన్న సహృదయం కలిగిన వ్యక్తి
మా నాన్న చలపతిరావు కంటే మా కంటే మీకే ఎక్కువగా తెలుసు. మా నాన్న ఎలా ఉంటారో చిన్నతనంలో తెలియదు. నేను ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత చలపతిరావు గురించి అందరూ చెప్పడం ద్వారానే చాలా తెలుసుకొన్నాం. ఇండస్ట్రీలో ప్రతీ ఒక్కరితో నాన్నతో ఏదో రకంగా అనుబంధం ఉండేది. మాకు ఆరోగ్యం లేకపోతే హాస్పిటల్‌లో చూపించారు. మా కష్టాలు వస్తే ఆదుకొన్నారు అని వాళ్ల చెబుతుంటే మా నాన్న ఇలా ఉంటారా అని తెలిసింది. తన పద్దతుల్లో రిలేషన్స్ మెయింటెన్ చేస్తూ ఇండస్ట్రీలో అందరికి బాబాయ్ అయ్యాడు అని రవిబాబు తెలిపారు.

మా నాన్నకు ఆ మూడు విషయాలు ఇష్టం
మా నాన్నకు జీవితంలో మూడే మూడు విషయాలు ఇష్టం. ఒకటి స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు.. రెండోది మంచి ఆహారం.. మూడోది హాస్యం. హాస్యం అంటే ఎంత ఇష్టమంటే.. తనకు తెలియని వారిపై కూడా జోక్స్ వేసి నవ్వించడం బాగా తెలుసు. అందరితో నవ్వుతూ సంతోషంగా ఉండేవారు. మంచి లైఫ్ లీడ్ చేశారు. రామారావును దేవుడిగా చూసేవాడు. ఆయనతో సుదీర్గమైన అనుబంధాన్ని కొనసాగించాడు. ఆయన సరదాగా ఉండి.. ఎలాంటి కష్టం తెలియకుండా ఆయన మరణించారు. అంతకంటే మంచి మరణం ఎవరికి సంభవిస్తుంది అని రవిబాబు వేదాంతం చెప్పారు.

మా జీవితం పరిపూర్ణం.. ఆనందంగానే
చలపతిరావు మనసు ఎప్పుడూ హ్యాపీగా ఉండేది. మనకు డబ్బు, కీర్తి ఉంటుంది. కానీ ఆనందం అనేది కొనుక్కొనేది కాదు. మనం ఎంత డబ్బు పెట్టి కొన్నా అది జరగదు. ఆయనకు అది అలా సహజంగానే లభించింది. మా నాన్న గారు చాలా సంతోషంతో ఎలాంటి నొప్పి, బాధ లేకుండా వెళ్లిపోయారు. ఆయన జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించారు.
ఆయన చివరిసారిగా నేను రూపొందిస్తున్న సినిమాలో ఐదు రోజుల క్రితం నటించారు. ఆయనను కష్టపెట్టకుండా కుర్చీలో కూర్చోపెట్టి షూట్ చేశాం. ఆయన చివరి చిత్రం అదే. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని కోరుకొంటున్నాను అని రవిబాబు అన్నారు.


Click it and Unblock the Notifications











