ఓ ప్రాణం పోయిందన్నా .. సినిమా చూశాకే వెళ్తానన్నాడు, బన్నీపై ఏసీపీ షాకింగ్ కామెంట్స్
పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా, ఓ చిన్నారి చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో పోరాడుతున్నాడు. ఈ కేసుకు సంబంధించి టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాతి నుంచి పరిస్ధితులు ఒక్కసారిగా మారిపోయాయి.
అరెస్ట్ చేసిన తర్వాత అల్లు అర్జున్‌ను నాంపల్లి కోర్ట్ ముందు ప్రవేశపెట్టగా ఆయనకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే అల్లు అర్జున్ అప్పటికే హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జైలు నుంచి విడుదలయ్యాక అల్లు అర్జున్‌ను పరామర్శించడానికి టాలీవుడ్ మొత్తం ఆయన ఇంటి ముందు క్యూకట్టడం, తెలంగాణ ప్రభుత్వంపై రాజకీయ విమర్శలతో వాతావరణం వేడెక్కింది.

అయితే బాధిత కుటుంబాన్ని ఒక్కరంటే ఒక్కరు కూడా సినీ ప్రముఖుడు పట్టించుకోలేదని సోషల్ మీడియా హోరెత్తిపోయింది. కానీ అల్లు అర్జున్ ఒక్క రాత్రి జైలులో ఉండి వచ్చేసరికి ఇండస్ట్రీ మొత్తం ఆయన ఇంటి ముందు వాలిందని పోస్టులు వైరల్ అయ్యాయి. అయితే స్వయంగా అసెంబ్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తొక్కిసలాట ఘటన, అల్లు అర్జున్ అరెస్ట్‌పై కీలక వ్యాఖ్యలు చేయడం కలకం రేపింది. పోలీసులు రావొద్దని చెప్పినప్పటికీ హీరో వినిపించుకోలేదని.. రోడ్లపై ఊరేగింపులా, రోడ్ షో చేసుకుంటూ వచ్చారని ముఖ్యమంత్రి ఆరోపించారు.
హీరో గారు సైలెంట్‌గా సినిమా చూసి వెళితే ఏ గొడవ ఉండేది కాదని.. కానీ కారు రూఫ్ టాప్‌పై నిలబడి చేతులు ఊపుకుంటూ వెళ్లడం వల్లే తొక్కిసలాట జరిగిందని రేవంత్ రెడ్డి తెలిపారు. థియేటర్ బయట ఇంత జరుగుతున్నప్పటికీ ఆయన సినిమా చూస్తూ కూర్చొన్నారని సీఎం ఆరోపించారు. పోలీసులు పలుమార్లు అల్లు అర్జున్‌ను బయటికి పంపించేయాలని ప్రయత్నించినప్పటికీ థియేటర్ యాజమాన్యం అడ్డుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
అల్లు అర్జున్‌కు కాలు పోయిందా, కన్ను పోయిందా, కిడ్నీలు పోయాయా ఆయనను ఎందుకు అంతమంది పరామర్శించారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి తనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా గంటల వ్యవధిలో మీడియా సమావేశం పెట్టిన అల్లు అర్జున్ జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు. తొక్కిసలాట జరిగి ఒకరు చనిపోయిన విషయం నాకు తెల్లవారే వరకు తెలియదని తెలిపారు.
వివాదం నేపథ్యంలో హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ వీడియో ఆధారాలతో సహా ప్రెజేంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా చిక్కడపల్లి ఏసీపీ రమేశ్ మీడియాతో మాట్లాడారు. తొక్కిసలాటలో ఒకరు చనిపోయారని.. బాలుడు చనిపోయారని అల్లు దగ్గరికి వెళ్లి చెప్పేందుకు ప్రయత్నించామని కానీ మేనేజర్ మమ్మల్ని అక్కడి వరకు వెళ్లనివ్వలేదని ఏసీపీ తెలిపారు. అయినప్పటికీ ఎంతో కష్టపడి అల్లు అర్జున్‌ను ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పగా.. ఆయన మాత్రం సినిమా చూసిన తర్వాతే వెళ్తామని చెప్పారని ఏసీపీ రమేశ్ పేర్కొన్నారు. అనంతరం 10 నిమిషాలు టైం ఇచ్చామని.. ఆ తర్వాతే అల్లు అర్జున్‌ను బయటికి తీసుకొచ్చామని ఆయన స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications











