మాజీ సీఎం చంద్రబాబు పుట్టినరోజు: స్పెషల్ ట్వీట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి
సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఫుల్ జోష్‌లో కనిపిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికే రెండు చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ఆయన.. మరికొన్ని ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు రెడీగా ఉన్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం 'ఆచార్య' మూవీ షూటింగ్‌ను చేస్తున్నారు. ఇది పట్టాలపై ఉండగానే.. వరుస చిత్రాలను ప్రకటిస్తూ దూకుడు ప్రదర్శిస్తోన్న ఆయన.. ఎన్నో అంశాలపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. మరీ ముఖ్యంగా ప్రముఖులు గురించి పలు రకాల పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఏపీ మాజీ సీఎంకు విషెస్ చెప్పారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు నవ్యాంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పని చేసిన నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు నేడు. దీనిని పురస్కరించుకుని ఆయనకు ఎంతో మంది శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా ట్విట్టర్ ద్వారా బర్త్‌డే విషెస్ తెలియజేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో 'అభివృద్ధికి పాటుపడుతూ ఎంతగానో శ్రమించే ఉన్నతమైన కమిట్మెంట్ కలిగిన నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నా' అంటూ పోస్టు చేశారు. దీనిపై తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు సీబీఎన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'ఆచార్య' అనే సినిమాలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా కీలక పాత్రను పోషిస్తున్నాడు. దీనితో పాటు మలయాళ సూపర్ హిట్ మూవీ 'లూసీఫర్', తమిళ చిత్రం 'వేదాళం'ను కూడా రీమేక్ చేయబోతున్నారు. ఈ సినిమాలతో పాటు కేఎస్ రవీంద్రతో మరో చిత్రాన్ని కూడా ప్రకటించారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల చిరంజీవి చేయాల్సిన షూటింగ్ ఆగిపోయింది. దీంతో ఆయన సినిమా 'ఆచార్య' కూడా వాయిదా పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.



Click it and Unblock the Notifications











