Konijeti Rosaiah: మాజీ సీఎంకు చిరంజీవి సంతాపం.. రాజకీయాల్లో ఒక శకం ముగిసిందంటూ ట్వీట్
తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా వరుసగా విషాదకర సంఘటనలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఎంతో మంది ప్రముఖులు కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలను కోల్పోయారు. మరికొందరు పలు కారణాలతో కన్నుమూశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మరణించారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతోన్న ఆయనకు.. ఈరోజు ఉదయం పల్స్ పడిపోయింది. దీంతో ఆయనను నగరంలోని ప్రముఖ ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ, అప్పటికే ఆయన తుది శ్వాసను విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతి పట్ల రాజకీయ, సినీ రంగానికి చెందిన ప్రముఖలులు సంతాపం తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా ఎంతో మంది రాజకీయ నాయకులు రోశయ్య పార్థివదేహానికి నివాళులర్పించారు. అదే సమయంలో చాలా మంది సినీ ప్రముఖులు సైతం సోషల్ మీడియా వేదికగా రోశయ్యకు సంతాపం తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి మాజీ ముఖ్యమంత్రి మరణ వార్తపై స్పందించారు. ఈ మేరకు ఓ ప్రకటనను షేర్ చేశారు.

చిరంజీవి వదిలిన ప్రకటనలో 'మాజీ గవర్నర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గారి మృతి తీరని విషాదం. ఆయన రాజకీయాలలో భీష్మాచార్యుడు వంటి వారు. ప్రజా జీవితంలో రోశయ్య గారు ఒక మహోన్నత నేత. రాజకీయ విలువలు, అత్యున్నత సంప్రదాయాలు కాపాడడంలో ఆయన ఓ రుషిలా సేవ చేశారు. వివాదరహితులుగా, నిష్కళంకితులుగా ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి రోశయ్య గారు. ఆయన కన్నుమూయడంతో రాజకీయాలలో ఓ శకం ముగిసింది. రోశయ్య గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను' అంటూ పేర్కొన్నారు.
మరోవైపు, ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కూడా రోశయ్య మృతికి సంతాపం తెలియజేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో 'ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య గారి మరణం దిగ్భ్రాంతికరం. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని దేవున్ని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను' అంటూ పోస్ట్ చేశారు. వీళ్లు మాత్రమే కాదు.. టాలీవుడ్‌కు చెందిన చాలా మంది ప్రముఖులు రోశయ్య మరణంపై తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. కొందరు ఆయన పార్థీవదేహాన్ని చూసేందుకు తరలి వెళ్తున్నట్లు తెలిసింది.

ఇదిలా ఉండగా.. గుంటూరు జిల్లా వేమూరులో రోశయ్య జన్మించారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా పనిచేశారు. కాంగ్రెస్‌లో కీలక నేతగా ఎదిగిన రోశయ్య, దాదాపు ఆరు దశాబ్దాల పాటు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఏపీకి సీఎం అయ్యారు. అనంతరం తమిళనాడుకు గవర్నర్‌గా పని చేశారు. ఇక, ఆయన భౌతికకాయాన్ని సందర్శకుల కోసం రేపు ఉదయం 11 గంటలకు గాంధీభవన్‌కు తరలిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు మహాప్రస్థానంలో రోశయ్య అంత్యక్రియలు జరనున్నాయట.


Click it and Unblock the Notifications











