నా కొడుకు చివరి కోరిక తీరకుండానే.. మెగా ఫ్యామిలీ కనికరించలేదు.. శిరీష్ భరద్వాజ్ తల్లి కంటతడి
ఉన్నత విద్యావంతులైనా, ఎంతటి అభ్యుదయ భావాలున్నా సరే తమ దాకా వచ్చేసరికి కులాంతర , మతాంతర వివాహాలను అంగీకరించని సమాజం మనది. రాను రాను జనాల్లో ఈ మెంటాలిటీ పెరిగేదే కానీ తగ్గేదే కాదని కొన్ని సంఘటనలు రుజువు చేస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే.
దశాబ్ధం క్రితం తెలుగు నాట సంచలనానికి కేంద్ర బిందువుగా మారిన శిరీష్ హఠాన్మరణం జనాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రేమించడం, అమ్మాయి కుటుంబం దానిని అంగీకరించకపోవడం.. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడం.. ఏ పిల్లో పిల్లాడో పుట్టిన తర్వాత తిరిగి మాటలు కలవడం ఎన్నో సినిమాల్లో చూశాం. శిరీష్ జీవితంలోనూ అలాగే జరుగుతుందని అంతా భావించారు. కానీ చిరంజీవి కుటుంబం దిగిరాలేదు.

అప్పట్లో శిరీష్ - శ్రీజలకు రక్షణ కల్పించాలని ఢిల్లీ హైకోర్ట్ ఆదేశించింది. ఆ తర్వాత చిరు తమ్ముడు, శ్రీజ బాబాయ్ పవన్ కళ్యాణ్ తన లైసెన్స్‌డ్ గన్‌ని తీసుకెళ్లి పోలీసులకు సరెండర్ చేశారు. సీన్ కట్ చేస్తే , తను పెద్దలను ఎదిరించి.. మీడియాలో సంచలనం సృష్టించి ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న శిరీష్‌పై అదే శ్రీజ వరకట్న వేధింపుల కేసు పెట్టింది. కేసులు, అరెస్ట్ భయంతో శిరీష్ కొన్నాళ్లు తప్పించుకుని తిరిగినా చివరికి పోలీసుల ఎదుట లొంగిపోయాడు, కొన్నాళ్లు జైలుకు కూడా వెళ్లొచ్చాడు.
శ్రీజ- శిరీష్‌లకు ఒక పాప పుట్టింది.. ఆమె పేరే నివృతి భరద్వాజ్. తను చనిపోవడానికి కొన్ని రోజుల ముందు కూతురిని చూసుకోవాలని శిరీష్ తపించిపోయారట. కానీ మెగాస్టార్ కుటుంబం ఏమాత్రం పట్టించుకోలేదట. ఈ విషయాన్ని శిరీష్ తల్లి స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెబుతూ కన్నీటీ పర్యంతమయ్యారు. శిరీష్‌కు తన కూతురు నివృతి అంటే చాలా ఇష్టమని.. చివరి రోజుల్లో ఒకసారి చూడాలని ఉందని చెబితే.. తాము ఎంతగా బ్రతిమలాడినా చిరంజీవి కుటుంబ సభ్యులెవరూ చూపించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఏదేమైనా నివృతి తమ వంశమని.. తన మొదటి మనవరాలని .. ఎప్పుడైనా కలిస్తే తన కుటుంబాన్ని పరిచయం చేస్తానన్నారు. శిరీష్ - శ్రీజ విడిపోవడానికి కారణాలు తనకు తెలియవని, శ్రీజ చాలా మంచి అమ్మాయని అందరితో ఎంతో బాగుండేదని ఆమె వెల్లడించారు. అలాగే అంతా అనుకున్నట్లుగా శిరీష్ చెన్నైలో సెటిల్ కాలేదని.. హైదరాబాద్‌లోనే ఉన్నాడని తెలిపారు.విడాకుల సమయంలో తమకు చిరంజీవి కుటుంబం డబ్బులు ఇస్తామంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తమని ఆమె పేర్కొన్నారు. అంత డబ్బు తీసుకుంటే తాము అద్దె ఇంట్లో ఎందుకు ఉంటామని శిరీష్ తల్లి ప్రశ్నిస్తున్నారు.
అయితే చిరంజీవి కుటుంబం నుంచి డబ్బు ఇస్తామని ప్రతిపాదన వచ్చిందన్నారు. కానీ తన భర్త బతికున్నప్పుడే.. తాము ఆ మొత్తాన్ని నివృతి కోసం ఉపయోగించమని చెప్పామన్నారు. శిరీష్ మరణవార్తను చిరంజీవి కుటుంబానికి తెలియజేశామని.. కానీ వారిలో ఎవరూ అంత్యక్రియలకు కూడా రాలేదని, వాళ్లు పెద్దవాళ్లని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త లాయర్‌గా పనిచేసేవారని, 2016లో ఆయన కూడా కన్నుమూశారని.. ఇప్పుడు చిన్న కొడుకుతో ఉంటున్నానని ఆమె ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కూతురిని చూడాలనుకున్న శిరీష్ ఆశ నెరవేరలేదని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











