MSVPG Pre Release Event: వెంకటేష్‌తో ఫుల్ లెంగ్త్ మూవీకి రెడీ... అనిల్ రావిపూడిదే బాధ్యత.. చిరంజీవి
షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సాహు గారపాటితో కలిసి చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల నిర్మించిన చిత్రం మన శంకర వరప్రసాద్ గారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి హీరో కాగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. చిరు సరసన లేడీ సూపర్‌స్టార్ నయనతార హీరోయిన్‌గా నటించారు. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు, విక్టరీ వెంకటేష్ కీలకపాత్ర పోషించారు. కేథరిన్ థ్రెసా, మాస్టర్ రేవంత్, బేబీ ఐరా, హర్షవర్థన్‌లు తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా.. భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకత్వం వహిస్తున్నారు, తమ్మిరాజు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.
సంక్రాంతి కానుకగా జనవరి 12న మన శంకర వరప్రసాద్ గారు మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడటంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. దీనిలో భాగంగా జనవరి 7వ తేదీన హైదరాబాద్ శిల్పకళా వేదికలో మన శంకర వరప్రసాద్ గారు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. వెంకటేష్ గారితో నటించడం నాకు చాలా ఆనందంగా ఉంది. మనదే కదా సంక్రాంతి, ఇరగదీద్దాం సంక్రాంతి అనేది కేవలం మన శంకర వరప్రసాద్ గారిదే కాదు. ఈ సంక్రాంతి మొత్తం మన తెలుగు చిత్ర పరిశ్రమది అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని అని చిరు అన్నారు.

ప్రభాస్ రాజా సాబ్ కానీ, అన్నయ్య అంటూ ఆప్యాయంగా పిలిచే నా తమ్ముడి రవితేజ సినిమా కానీ, మా ఇంట్లో పెరిగిన పిల్లాడు శర్వానంద్ నారీ నారా నడుమ మురారి కానీ, గురువుగా నన్ను భావిస్తూ, శిష్యుడిలా ఉన్న నవీన్ పొలిశెట్టి.. వీళ్లందరి సినిమాలు బాగా ఆడాలి. తెలుగు సినిమాకు, నిర్మాతలకు, బయ్యర్లకు వీరందరు సుభిక్షంగా ఉన్నప్పుడే నిజమైన సంక్రాంతి. అలాంటి సంక్రాంతి రావాలని కోరుకుంటున్నానని చిరు అన్నారు. 2026 సంక్రాంతిని తెలుగు చలనచిత్ర పరిశ్రమ మరిచిపోకూడదు. అలాంటి సంక్రాంతిని మీరు మాకు ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడున్న ప్రతి సినిమా కూడా కామెడీ జోనర్, ఫ్యామిలీ జోనర్, ఎంటర్‌టైన్‌మెంట్ జోనర్‌తో పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమాలు. కాబట్టి ఈ సంక్రాంతికి అన్ని సినిమాలు బాగా ఆడతాయని అనుకుంటున్నాను, ఆడేలా చేసే బాధ్యత మీదే. అన్ని సినిమాలను థియేటర్‌లోనే చూసి ఆశీర్వదించండి అని మెగాస్టార్ కోరారు.
చాలాకాలం క్రితం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు ఒక మాట అనేవారు. బాబాయ్.. నీకు అనిల్ రావిపూడి సినిమాలు ఎన్ని చూశావో తెలియదు కానీ, అతని కామెడీ టైమింగ్ కానీ, అతని హుషారు కానీ చూస్తే నాకు మళ్లీ మీతోటి అతను చేయగలిగితే ఆ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చే సినిమా వేరే లెవల్‌లో ఉంటుందని రాఘవేంద్రరావు గారు అన్నారు. ఈ ఏడాది బిగినింగ్‌లో ఆయన చేతుల మీదుగానే క్లాప్ కొట్టి మా సినిమా ప్రారంభించారు. చాలాసార్లు సెట్‌కి రావాలని రాఘవేంద్రరావు గారు అనుకున్నారు.. మేమే పిలవలేదు. హీరోయిన్ ఉన్నప్పుడే సెట్‌కి వస్తానని అనేవారు. ఎందుకో కుదరలేదు అని చిరంజీవి అన్నారు.
అనిల్ రావిపూడి కథ చెప్పినప్పుడు నాకు బాగా నచ్చింది. ఫ్యామిలీ టచ్ ఉంది, సెంటిమెంట్ ఉంది, చిన్నపిల్లలతోటి నాకు అటాచ్‌మెంట్ ఉంది, హార్ట్ టచింగ్ సీన్స్ ఉన్నాయి. ఇలాంటి సినిమాకి ఆ కామెడీ జోనర్ కలిస్తే చాలా బాగుంటుంది. నాది ఇందులో ఎస్‌పీజీ క్యారెక్టర్. వైవిధ్యంగా చేద్దామని నేను చెబితే.. అస్సలు వైవిధ్యం వద్దండీ. మీరు గతంలో దొంగ మొగుడు, ఘరానా మొగుడు, అన్నయ్య చేశారో నాకు అలా ఉంటే చాలు. అప్పట్లో మిమ్మల్ని చూసిన వారంతా చాలా పెద్దవాళ్లు అయిపోయారు. వాళ్లకి అవి గత స్మృతులు. ఇప్పుడున్న జనరేషన్‌కు మీ టైమింగ్ తెలియకపోవచ్చు. మధ్యలో పుట్టిన మాలాంటి వాళ్లం.. ఈ జనరేషన్‌కి మీరంటే ఏంటో తెలియజేయాలని అనుకున్నాను అని అనిల్ చెప్పాడని చిరంజీవి అన్నారు.
అలాంటి సీన్స్ చేయడం నాకు కూడా చాలా తేలిక. నేను గతంలో చేసిన పాత్రల తాలూకా సీన్స్‌ని అనిల్ జేబులో పెట్టుకుని తిరిగేవాడు. చాలా చక్కటి హోంవర్క్ చేసుకుని, నా బాడీకి, నాకు ఏది పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందో ఆ విధంగా సీన్స్ తీశాడు. ఈ సినిమాలో అనిల్‌తో చేయడం చక్కటి ఎక్స్‌పీరియన్స్. సినిమా షూటింగ్ చివరి రోజున చాలా ఎమోషనల్ అయ్యాను. ఒక సినిమా అయ్యిందంటే చాలు రా.. ఇక మనం వేరే సినిమాకి షిఫ్ట్ అయిపోవచ్చు అన్న మూడ్‌లో ఉంటాం. కానీ ఈ సినిమా ఆఖరి రోజున కాలేజీ వదిలేసి వెళ్లిపోయే స్టూడెంట్‌గా అనిపించింది. అలాంటి ఎమోషన్ ఎందుకో లోనయ్యాను. అనిల్ కూడా నాకు కూడా అదే ఫీలింగ్ ఉందని అన్నాడు. ప్రతిరోజూ పిక్నిక్‌కి వెళ్లినట్లుగా సరదాగా షూటింగ్ జరిగింది. ఎప్పుడో కెరీర్ బిగినింగ్‌లో ఇలా జరిగినట్లుగా గుర్తు... ఈ మధ్యకాలంలో ఎప్పుడూ ఇలా జరగలేదని మెగాస్టార్ తెలిపారు.
అనిల్ సెట్ మొత్తం ఎప్పుడూ హుషారుగా ఉంచుతాడు. ఇలాంటి డైరెక్టర్ దొరికితే కేక్‌వాక్‌లా చేసుకుపోవచ్చు. ఈ సినిమా ఆల్రెడీ సూపర్ హిట్ అయిపోయింది. బడ్జెట్ పరంగా లిమిట్‌లో, డేస్ పరంగా అనుకున్నదాని కంటే తక్కువ రోజుల్లో అత్యద్భుతంగా తీయగలిగాడు అనిల్. ఒక సినిమా సూపర్ హిట్ అయ్యిందని ఎలా చెప్పగలమంటే ఒక డైరెక్టర్ సినిమా మొత్తాన్ని గ్రిప్‌లో ఉంచుకుని అది బడ్జెట్ దాటనివ్వకుండా చేయగలగడంలోనే సక్సెస్ ఉంది. అలాంటి సినిమాలు ఎన్ని ఉన్నాయంటే చాలా తక్కువగా మనం లెక్కపెట్టుకోవాలని చిరంజీవి అన్నారు.
వెంకటేష్ చాలా డెప్త్ ఉన్న మనిషి.. అతనితో మనకి టైం తెలియదు. వయసుకు మించిన విషయాలు చెబుతూ, జీవితం ఎలా ఉండాలని చెబుతుంటే నాకు గురువులా కనిపిస్తాడు. సినిమాను, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. నేనూ, వెంకీ అమెరికా వెళ్లినప్పుడు మీరిద్దరూ పక్కపక్కన ఉంటే చాలా బాగుందని అన్నారు. చిరంజీవి బాస్‌లా కూర్చొంటే నేను మీ వెనుక నిలబడతాను.. ఇది మంచి స్టోరీకి స్టిల్ అవ్వాలని వెంకటేష్ చెప్పారు. మా ఇద్దరి కాంబోలో సినిమా చేయాలని ఉందని వెంకీ చెప్పగానే ముచ్చటేసింది. వాళ్లు ఫోటోలు తీయడం అవి వైరల్ కావడం జరిగిపోయింది. ఆల్రెడీ వెంకీతో అనిల్‌కి మంచి అనుబంధం ఉండటంతో అతనికి మాత్రమే మా ఇద్దరినీ మ్యాచ్ చేయగల సత్తా ఉందని అనుకున్నా. దీనిపై అనిల్‌కి హింట్ ఇవ్వగా.. మా ఇద్దరితో చాలా బాగా తీశాడు అని చిరంజీవి ప్రశంసించారు.
నేను, వెంకటేష్ అల్లరి చేసినట్లుగా సీన్స్ ఉంటాయి. సినిమాను మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. లాస్ట్‌లో సినిమా ఎక్కడికో లేచిపోతుంది. ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నందుకు వెంకటేష్‌కి మనస్పూర్తిగా ధన్యవాదాలు. ఇద్దరం కలిసి 18 రోజులు షూటింగ్ చేశాం. ఇది షూటింగ్‌లా అనిపించలేదు.. ప్రతి సినిమా ఇలాగే ఉంటే బాగుండు అనిపించింది. ఈ కాంబినేషన్ ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఎప్పుడు దొరుకుతుందంటే నేను రెడీ. ఎవరో ఎందుకు.. ఈ అవకాశం నువ్వు తీసుకుని ఖచ్చితంగా స్టోరీ రాసుకో. మేమిద్దరం ఇదే ప్రాణం పెట్టి, ఇదే హుషారుతో సినిమా చేసి పెడతాం. ఏం చేశాడో? ఎలా ఒప్పించాడో కానీ అంతకుముందు నయనతారతో రెండు సినిమాలు చేశాను. ఆ సినిమాలో తను చాలా గుంబనంగా ఉంటుంది. తన పని తాను చేసుకోవడం వెళ్లిపోవడం. ఈ సినిమాలో అయితే ఎంత సరదాగా గడిచిపోయిందో. తనను ఏం చేశావు? తను ప్రోమోస్‌కి ఒప్పుకోవడం ఏంటీ? అని అనిల్‌ని అడిగేవాడిని. నా పక్కన నయనతారే సెట్ అవుతుందని ఒప్పించి తీసుకొచ్చాడని చిరంజీవి తెలిపారు.
లిరిక్స్ అర్ధమయ్యేలా భీమ్స్ మంచి సంగీతం అందించాడు. నన్ను సమీర్ రెడ్డి చాలా అందంగా చూపించారు. ఈ సినిమాలోని కొన్ని సీన్స్‌ని అనిల్ రావిపూడి ట్రిమ్ చేశారు.. అలా చేయాలంటే ఎంతో దమ్ముండాలి. సుస్మిత నిర్మాతగా రావాలని అనుకున్నప్పుడు.. ఈ పరిశ్రమ తనని ఖచ్చితంగా ఆదరిస్తుందనే చెప్పా. కష్టపడటానికి నా బిడ్డ ఎక్కడా వెనకడుగు వేయలేదు. మా నాన్నని మెప్పించాలని తను కూడా టెక్నీషియన్‌లా కష్టపడింది. ఇండస్ట్రీలో నాకు చేదోడు వాదోడుగా నిలబడింది. నాకు రామ్ చరణ్ ఎలాగో సుస్మిత కూడా అంతే. కష్టాన్ని నమ్ముకుంటే మీకు భగవంతుడు విజయాన్ని అందిస్తాడు అని చిరంజీవి ముగించారు.


Click it and Unblock the Notifications











