Twins for Ram Charan: ఆయన దయ, కృప వల్లే మా ఇంట్లోకి కవలలు.. చిరంజీవి భావోద్వేగం
మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఉపాసన దంపతులు కవల పిల్లలకు జన్మనివ్వడంపై మెగా అభిమానుల్లో, సన్నిహితుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. ఈ వార్త తెలియగానే పెద్ద ఎత్తున మెగా ఫ్యాన్స్ అపోలో హాస్పిటల్‌కు తరలి వచ్చారు. బాణాసంచా కాల్చి పండుగ వాతావరణాన్ని తలపించారు. తనకు మనవడు, మనవరాలు జన్మించడంపై మెగాస్టార్ చిరంజీవి ఆనందంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..
అందరికీ నమస్కారం. మమ్మల్ని అభిమానించే శ్రేయోభిలాషులు, అభిమానులు, మా మంచిని కాక్షించే ప్రతీ ఒక్కరితో శుభవార్తను పంచుకోడానికి మీడియా మిత్రుల ద్వారా మీ ముందుకు వచ్చాం. ఈ ఆనందాన్ని పంచుకోవడానికి ఈ వేదికను అవకాశంగా తీసుకొన్నాను. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అటు కొణిదెల ఫ్యామిలీ, ఇటు కామినేని ఫ్యామిలీ రెండు కుటుంబాలు కలిసి ఈ సంతోషాన్ని వ్యక్త పరుస్తున్నాం అని చిరంజీవి అన్నారు.

రాంచరణ్, ఉపాసన దంపతులు శనివారం రాత్రి కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఉపాసన, పిల్లలు ఆరోగ్యంతో ఉన్నారు. ఈ వార్తను మీతో పంచుకోవాలని మీ ముందుకు వచ్చాను. ఎప్పటి నుంచో మా ఇంట్లో ఇలాంటి శుభం జరగాలని కోరుకొన్నారు. ఆ భగవంతుడి దయవల్ల, హనుమాన్ కృప వల్ల ఒక ఆడబిడ్డ, ఒక మగబిడ్డ జన్మించారు. ఇది మాకు ఎనలేని సంతోషాన్ని అందించింది. మమ్మల్ని అభిమానించే వారికి ఈ వార్తను షేర్ చేసుకోవడం అత్యంత ఆనందాన్ని కలిగించే విషయం అని చిరంజీవి చెప్పారు.
ఉపాసన సుఖ ప్రసవానికి కృషి చేసిన డాక్టర్ సుమన గారు ధన్యవాదాలు. క్లింకారకు కూడా ఆమెనే జన్మనిచ్చేలా చేశారు. అపోలో గైనకాలజిస్ట్ రుమా సిన్హా గారు.. పర్యవేక్షించారు. ఆమెకు కూడా ధన్యవాదాలు. పిడియాట్రిక్ నిపుణులు లత గారికి, సిబ్బందికి కూడా నా ధన్యవాదాలు. ఈ శుభ సందర్బాన్ని నా అభిమానులు పండగలా జరుపుకోవడం మరింత ఆనందాన్ని ఇస్తున్నది. ఈ ఆనంద సమయంలో ప్రతీ ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఈ సమావేశంలో డాక్టర్లు సుమన, రుమా సిన్హా, లత మీడియాతో మాట్లాడారు. ఉపాసన, ఇద్దరు పిల్లలు ఆరోగ్యంతో ఉన్నారు. పిల్లలు చాలా అందంగా ఉన్నారు. మొదట అబ్బాయి పుట్టారు. ఆ తర్వాత అమ్మాయి పుట్టారు. మెగా ఫ్యామిలీలో డబుల్ జాయ్ కలిగింది. ఈ కుటుంబానికి ధన్యవాదాలు అని అన్నారు.
అంతకు ముందు చిరంజీవి ఈ వార్తను తన సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. రాంచరణ్, ఉపాసన దంపతులు ఇద్దరు కవలలక జన్మనిచ్చారు. ఒకరు బాబు, మరొకరు అమ్మాయి. ఈ విషయాన్ని మీతో పంచుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. ఇద్దరు చిన్నారులు, తల్లి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. ఇద్దరు చిన్నారులను మా కుటుంబంలోకి ఆహ్వానించడం మాకు ఎనలేని సంతోషాన్ని ఇస్తున్నది. తాత, అమ్మమ్మలుగా మాకు భగవంతుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నాం అని చిరంజీవి అన్నారు.


Click it and Unblock the Notifications











