చిరంజీవి కోసం పవన్ కళ్యాణ్.. ఒకే ఫ్రేమ్‌లో మెగా బ్రదర్స్
టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ మరోసారి స్పష్టమైంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'మెగా 158' చిత్రం నేడు (మే 21) ఘనంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో వైభవంగా నిర్వహించిన ఈ పూజా కార్యక్రమం సినీ వర్గాల్లోనే కాకుండా అభిమానుల్లోనూ భారీ ఉత్సాహాన్ని నింపింది.
అయితే.. ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా బ్రదర్ నాగబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ స్వయంగా కొబ్బరికాయ కొట్టి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇవ్వడం ఈ ఈవెంట్‌కు హైలైట్‌గా నిలిచింది. ఒకే వేదికపై మెగా బ్రదర్స్ ముగ్గురు కనిపించడం అభిమానులకు ప్రత్యేక ఆనందాన్ని కలిగించింది.

ఈ లాంచ్ ఈవెంట్‌లో కనిపించిన మెగా బాండింగ్ అందరినీ ఆకట్టుకుంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఒకే కారులో రావడం, నాగబాబుతో కలిసి ఒకే సోఫాలో కూర్చుని సరదాగా మాట్లాడుకోవడం వంటి క్షణాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. "ఇదే అసలు మెగా ఫ్యామిలీ" అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ భావోద్వేగ క్షణాలు ఈవెంట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఇక సినిమా ప్రారంభ కార్యక్రమం కూడా ఘనంగా జరిగింది. చిరంజీవిపై ముహూర్తపు క్లాప్ ఇచ్చిన పవన్ కళ్యాణ్, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. నిర్మాత సుస్మిత కొణిదెల, దర్శకుడు వీవీ వినాయక్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, సీనియర్ దర్శకులు ఏ. కోదండరామిరెడ్డి, బి. గోపాల్ స్క్రిప్ట్‌ను బాబీకి అందించారు. ఈ వేడుకలో అల్లు అరవింద్, దిల్ రాజు, బండ్ల గణేష్, మెహర్ రమేష్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
'వాల్తేరు వీరయ్య' బ్లాక్‌బస్టర్ తర్వాత చిరంజీవి - బాబీ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో 'మెగా 158'పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసారి కూడా మాస్ ఎంటర్‌టైనర్‌గా, హై వోల్టేజ్ యాక్షన్‌తో పాటు ఎమోషన్ మిక్స్ చేసిన కథతో రాబోతుందని టాక్ వినిపిస్తోంది. దర్శకుడు బాబీ తన మాస్ ప్రెజెంటేషన్‌తో మరోసారి మెగా ఫ్యాన్స్‌ను మెప్పించేందుకు సిద్ధమయ్యారు.
ఈ సినిమాలో మలయాళ నటి అనశ్వర రాజన్ కీలక పాత్రలో నటిస్తున్నట్టు అధికారికంగా స్పష్టమైంది. ఓపెనింగ్ సెర్మనీలో ఆమె హాజరవ్వడంతో ఈ విషయం కన్ఫర్మ్ అయింది. ఆమె చిరంజీవి కుమార్తె పాత్రలో కనిపించబోతుందనే టాక్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అదేవిధంగా మోహన్ లాల్, ప్రియమణి, అనురాగ్ కశ్యప్ వంటి స్టార్ కాస్ట్ కూడా ఈ చిత్రంలో ఉండొచ్చనే ప్రచారం కొనసాగుతోంది.
సాంకేతికంగా కూడా ఈ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కనుంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాటోగ్రఫీని విజయ్ కార్తీక్ కన్నన్ నిర్వహిస్తుండగా, సంగీతాన్ని ఎస్. థమన్ అందిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైన్‌ను అవినాష్ కొల్లా, ఎడిటింగ్‌ను రూబెన్ చేపట్టారు.
ఈ సినిమా మెగాస్టార్ కెరీర్‌లో 158వ సినిమాగా తెరకెక్కుతుండటం ప్రత్యేకత. మొదటి నుంచే భారీ స్థాయిలో హైప్‌ను సొంతం చేసుకున్న ఈ ప్రాజెక్ట్, లాంచ్ ఈవెంట్‌తో మరింత చర్చనీయాంశమైంది. మెగా ఫ్యామిలీ మొత్తం ఒకే వేదికపై కనిపించడం, పవన్ కళ్యాణ్ పాల్గొనడంతో ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.
ఇలా 'మెగా 158' లాంచ్ కేవలం సినిమా ప్రారంభం మాత్రమే కాదు... మెగా ఫ్యాన్స్‌కు ఓ ఎమోషనల్ సెలబ్రేషన్‌గా మారింది. ఇక షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుంది? అనే ఆసక్తి ఇప్పుడు మరింత పెరిగింది. రాబోయే రోజుల్లో ఈ సినిమా నుంచి మరిన్ని సర్ప్రైజ్‌లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications




