చంద్రబాబుపై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు.. అది వాళ్ల నమ్మకం.. నెంబర్ వన్ అవ్వాలంటూ!
మిగిలిన అన్ని రాష్ట్రాల కంటే, పార్లమెంట్ ఎన్నికల కంటే ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే అసెంబ్లీ ఫలితాలు ఎంతో ఉత్కంఠను రేపాయి. అందుకు తగ్గట్లుగానే వీటిపై రోజురోజుకూ ఆసక్తి భారీ స్థాయిలో పెరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో అంచనాలను నిలబెట్టుకుంటూ కూటమి పార్టీలు తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేనలు ఈ ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ ట్వీట్ చేశారు. ఆ వివరాలను మీరే చూసేయండి!
గత నెలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడే వెలువడ్డాయి. ఇందులో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కూటమి విజయం సాధించింది. ఇప్పటికే 110కి పైగా సీట్లలో విజయం సాధించి.. మరో 50కి పైగా స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ దూసుకుపోతోంది. తద్వారా ఈ కూటమి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఎవరూ ఊహించని రీతిలో ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకున్న కూటమికి మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన X (ట్విట్టర్) ఖాతాలో సుదీర్ఘమైన పోస్టును చేశారు.
మెగాస్టార్ చిరంజీవి తాజాగా చేసిన ట్వీట్‌లో 'ప్రియమైన చంద్రబాబు నాయుడు గారికి.. చరిత్రలో అరుదైన విజయాన్ని అందుకున్న మీకు ముందుగా శుభాకాంక్షలు, అభినందనలు. ఈ మహత్తర విజయం.. మీ మీద ప్రజలకు ఉన్న నమ్మకానికి, మీ నాయకత్వ పటిమకు, రాష్ట్రానికి గత వైభవం తిరిగి తేగలిగిన మీ దక్షతకు నిదర్శనం' అంటూ రాసుకొచ్చారు.
చిరంజీవి అదే ట్వీట్‌లో 'రాజకీయ దురంధరులైన మీ మీద, అలాగే పవన్ కల్యాణ్, నరేంద్ర మోడీ గారి మీద ప్రజలు కనపరచిన విశ్వాసాన్ని సంపూర్ణంగా నిలబెట్టుకోవాలని ఆశిస్తున్నా. రాజధాని లేని, గాయపడిన రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టి నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నాను' అంటూ చెప్పుకొచ్చారు. దీనిపై టీడీపీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











