పవన్ కల్యాణ్ 100 శాతం కరెక్ట్.. ఎవడి సొత్తు కాదు.. చిరంజీవి ఎమోషనల్
భోళా శంకర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. ఇటీవల బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఇండస్ట్రీలోకి కొత్త నీరు వస్తేనే శుభపరిణామం, ఇండస్ట్రీ ఎదుగుదల ఉంటుందని చెప్పారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమా ఈవెంట్‌లో చిరంజీవి చెప్పిన విషయాలు ఏమిటి? పవన్ కల్యాణ్ చెప్పిన మాటలు ఏమిటనే వివరాల్లోకి వెళితే..
బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీ ఏ ఒక్కరి సొత్తు కాదు. ఎవరైనా ప్రతిభ ఉంటేనే ప్రేక్షకుల గుర్తిస్తారు. మా ఇంట్లో ఎంత మంది హీరోలు ఉన్నా.. టాలెంట్ లేకపోతే ఇండస్ట్రీలో నిలబడలేరు. నేను ఎప్పుడూ మా హీరోల సినిమాలను ప్రమోట్ చేయను. సొంతంగా ఎదగమని చెబుతుంటాను అంటూ పవన్ కల్యాణ్ అన్నారు.

ఇక భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెగాస్టార్ మాట్లాడుతూ.. బ్రో సినిమా ఫంక్షన్‌లో పవన్ కల్యాణ్ ఓ మాట చెప్పాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎవరి సొత్తు కాదు. ఏ ఒక్కరి గుత్తాధిపత్యం కాదు. టాలెంట్ ఉన్న ప్రతీ ఒక్కరికి ఇక్కడ స్థానం ఉంది అని చిరంజీవి చెప్పారు.
మా ఇంట్లో హీరోలు ఉన్నప్పటికీ.. మేము ఎప్పడూ ప్రమోట్ చేయడానికి ముందుకు వెళ్లం. మేము ప్రయత్నించం. మిమ్మల్ని నమ్ముకొని నిర్మాత, దర్శకులు వస్తే కనుక మీ ప్రతిభను పరీక్షించుకోండి అని చెబుతాం. అదే విషయాన్ని కల్యాణ్ పునరుద్ఘాటించాడు అని చిరంజీవి అన్నారు.

సినీ ప్రపంచంలోకి యంగ్ టాలెంట్ వస్తుందంటే.. వారికి మా ఇమేజ్ సపోర్టు ఇస్తుందంటే.. మా వంతు ప్రయత్నం చేస్తాం. బలగం సినిమా చూసి వేణుకు సపోర్టు చేయాలని అనుకొన్నాను. ఈ రోజు వైవా హర్ష వచ్చి సినిమా తీసాను. పంతులు సినిమా చూసి నచ్చితే ఓ మాట చెప్పండన్నారు. స్వయంకృషితో హీరోగా ఎదుగుతున్నాడంటే సహకారం అందించాలనే నా బాధ్యత అని చిరంజీవి అన్నారు.
కొత్త రక్తం ఎక్కిస్తే.. పాత రక్తం స్థానంలో కొత్త రక్తంతో మరింత ఎనర్జీ వస్తుంది. అందుకే పాతతరంతోపాటు కొత్తతరం కూడా ఉండాలి. ఈ ఇండస్ట్రీ ఎంత గొప్పదంటే.. టాలెంట్ ఉంటే అక్కున చేర్చుకొంటుంది. ఇక్కడ ఉండే నిర్మాతలకు, దర్శకులకు నటీనటులకు మంచి జీవితాన్ని ఇండస్ట్రీ ఇస్తుంది. ఇండస్ట్రీ పుష్పక విమానం, అక్షయపాత్రలాంటిది అని చిరంజీవి చెప్పారు.


Click it and Unblock the Notifications











