దళపతి విజయ్‌కి చిరంజీవి సపోర్టు.. కలిసి పోరాడుదామని పిలుపు..
దక్షిణాది సూపర్ స్టార్ దళపతి విజయ్ (Vijay)నటించిన చివరి సినిమా 'జననాయగన్' (Jana Nayagan). ఈ సినిమా విడుదలకు ముందే ఆన్‌లైన్‌లో లీక్ అయిన విషయం తెలిసిందే. ఇంకా సెన్సార్ సర్టిఫికెట్ కూడా రాని ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశంతో పాటు ఓ పాట కూడా సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ఈ పరిణామం సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని కుదిపేస్తోంది. జననాయగన్ లీక్ ఘటనపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) స్పందించారు. ఈ సమయంలో మెగాస్టార్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ ఏమన్నారంటే?
తమిళ స్టార్ విజయ్ నటిస్తున్న ఈ భారీ సినిమా ఇంకా విడుదలకాకముందే కీలక ఫుటేజ్ ఆన్‌లైన్‌లోకి రావడం సినీ వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఇంట్రో సీన్, పాటకు సంబంధించిన భాగాలు లీక్ కావడం సినిమా టీమ్‌కు పెద్ద షాక్‌గా మారింది. దీనిపై నిర్మాణసంస్థ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ సినిమా సన్నివేశాలను షేర్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అనుమతులు లేకుండా సినిమాను (Jana Nayagan), అందులోని సన్నివేశాలు లీక్ చేయడం చట్టపరంగా నేరమని.. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నిర్మాణసంస్థ తరఫు లాయర్ నోటీసులు జారీ చేశారు.

సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సంచలనం రేపిన జననాయగన్ లీక్ ఘటనపై మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తీవ్రంగా స్పందించారు. విడుదలకు ముందే ఈ చిత్రానికి సంబంధించిన కీలక దృశ్యాలు ఆన్‌లైన్‌లో లీక్ కావడం సినీ వర్గాల్లో ఆందోళనకు దారితీసింది. ఈ ఘటనపై స్పందించిన చిరంజీవి, ఇది తనను తీవ్రంగా కలవరపెడుతోందని తెలిపారు. తన అధికారిక సోషల్ మీడియా వేదిక ద్వారా చిరంజీవి మాట్లాడుతూ, 'సినిమా అనేది కేవలం వినోదం కాదు... అది నమ్మకం, కృషి, ఎందరో వ్యక్తుల సమిష్టి కలల మీద నిర్మించబడుతుంది. ఇలాంటి లీక్ ఘటనలు ఆ కృషిని దెబ్బతీస్తాయి. పరిశ్రమలోని మనందరినీ ప్రభావితం చేస్తాయి'అని పేర్కొన్నారు.
ఈ సంఘటన సృజనాత్మక కంటెంట్‌ను రక్షించడం ఎంత ముఖ్యమో మరోసారి గుర్తు చేస్తుందని చిరంజీవి అన్నారు. అలాగే ఈ సినిమాని నిర్మిస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్ కు పూర్తి మద్దతు ప్రకటించిన చిరంజీవి, 'ఈ నష్టాన్ని అరికట్టడంలో, దోషులను శిక్షించడంలో మేమంతా ఏకతాటిపై నిలుస్తాం' అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రేక్షకులను ఉద్దేశించి 'సినిమాను గౌరవించండి, దాన్ని కాపాడండి. పోరాడుదాం' అని పిలుపునిచ్చారు. చివరగా పైరసీపై గట్టిగా స్పందిస్తూ 'పైరసీని అంతం చేయండి.. సినిమాను కాపాడండి' అన్నారు. చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications

















