‘ఆచార్య’ నుంచి అదిరిపోయే న్యూస్: ఆలస్యం చేయకుండా షురూ చేసేసిన చిరు
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బడా డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తోన్న చిత్రం 'ఆచార్య'. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఎంతో కీలకమైన పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో సందేశాత్మకంగా రాబోతున్న ఈ సినిమా దేవాదాయ భూముల ఆక్రమణల నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ కూడా పూర్తైంది. ఇక, కొద్ది రోజుల్లో టాకీ పార్ట్ మొత్తం పూర్తవుతుందని అనుకున్న సమయంలో కరోనా రెండో దశ వల్ల అది సాధ్యం కాలేదు. దీంతో విడుదల కూడా వాయిదా పడిపోయింది. ఈ నేపథ్యంలో ఓ గుడ్ న్యూస్ తెలిసింది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'ఆచార్య' మూవీ షూటింగ్ ఈరోజు హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. నగర శివారులో వేసిన టెంపుల్ టౌన్ సెట్‌లో చిత్రీకరణను ప్రారంభించారు. పద్నాలుగు రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో ఓ పాటతో పాటు చరణ్‌కు సంబంధించిన కొన్ని సీన్స్, చిరంజీవి చేయాల్సిన సన్నివేశాలు కొన్ని బాకీ ఉండిపోయాయి. అలాగే, ఇద్దరు హీరోలకూ సంబంధించిన రెండు యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా షూట్ చేయాల్సి ఉంది. నేటి నుంచి ఏకధాటిగా ఈ చిత్రీకరణ జరుగుతుందని తెలుస్తోంది. అది పూర్తైన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలెడతారని టాక్.

'ఆచార్య' మూవీలో చిరంజీవి, రామ్ చరణ్ నక్సలైట్లుగా నటిస్తున్నారు. ఓ మిషన్ కోసం ఇద్దరూ పని చేయగా.. అందులో సిద్ధ పాత్ర మరణిస్తుందట. ఆ తర్వాత ఆచార్య దాన్ని ఎలా కంప్లీట్ చేశాడన్న కథతో ఈ చిత్రం రూపొందుతోంది. మెగా మల్టీస్టారర్‌గా రాబోతున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా చేస్తోన్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం సమకూర్చుతున్నాడు. సంగీత, పోసాని కృష్ణ మురళి తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











