200 మందిని తాను భరించలేను.. జానీ మాస్టర్‌తో చార్మీ గొడవ ఏమిటంటే?
ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండస్ట్రీలో ఫుల్ డిమాండ్ ఉన్న డ్యాన్స్ మాస్టర్‌లలో జానీ మాస్టర్ ఒకరు. నెల్లూరు జిల్లాకు చెందిన జానీ .. ఈటీవీలో ప్రసారమైన పాపులర్ డ్యాన్స్ రియాలిటీ షో ఢీ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఆయనకు యంగ్ హీరో నితిన్ కొరియోగ్రాఫర్‌గా అవకాశం ఇచ్చారు. నితిన్ నటించిన ద్రోణ మూవీకి ఆయన కంపోజ్ చేసిన మూవ్‌మెంట్స్ మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇక అక్కడి నుంచి జానీ మాస్టర్ వెనుదిరిగి చూసుకోలేదు. రామ్ చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, రామ్ పోతినేని, రవితేజ, పునీత్ రాజ్‌కుమార్ , ధనుష్, సల్మాన్ ఖాన్, విజయ్, రజనీకాంత్, కిచ్చా సుదీప్, శివకార్తీకేయన్, సూర్య వంటి స్టార్స్‌కు అద్భుతమైన స్టెప్స్ అందించారు.
ముక్కుసూటితనం, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం జానీ మాస్టర్ స్టైల్. ఆయనతో పనిచేసేందుకు స్టార్స్ సైతం వెయిట్ చేస్తారనడంలో సందేహం లేదు. అంతేకాదు.. చిత్ర పరిశ్రమలో కొరియోగ్రాఫర్, డ్యాన్సర్లకు ఎంతో సాయం చేశారు . ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్సర్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎంతో సేవ చేశారు. డ్యాన్సర్స్ యూనియన్ టీఎఫ్‌టీటీడీఏలో 500 మందికి పైగా కుటుంబాలకు హెల్త్ ఇన్సూరెన్స్ అందేలా అండగా నిలబడ్డారు. కొరియోగ్రాఫర్‌గా స్టార్ సంపాదించిన జానీ మాస్టర్.. రన్నర్ అనే సినిమాతో హీరోగానూ మారాడు. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌ను ఎంతో అభిమానించే ఆయన.. పవన్ స్థాపించిన జనసేన పార్టీలో చేరారు. తన అభిమాన నటుడి విజయం కోసం పిఠాపురంలో ఇంటింటి ప్రచారం చేసి పవన్ గెలుపులో తన వంతు పాత్ర పోషించారు.

ఇదిలాఉండగా.. ఎనర్జీటిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో డబుల్ ఇస్మార్ట్ అనే మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీలోని 'మార్ ముంత చోడ్ చింత' ఐటెం సాంగ్‌లో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డైలాగ్‌ను హుక్‌లైన్‌గా వాడటం వివాదాస్పదమైంది. దీనిపై గులాబీ శ్రేణులు, తెలంగాణ వాదులు భగ్గుమంటుండటంతో వివాదం నడుస్తోంది. ఇది సద్దుమణగకముందే డబుల్ ఇస్మార్ట్ నిర్మాణం విషయంలో మరో కాంట్రవర్సీ చోటు చేసుకుంది.
తెలుగు చిత్ర పరిశ్రమలో పాటల చిత్రీకరణలో కొన్ని నిబంధనలు , షరతులు ఉంటాయని, దీని ప్రకారం పాటలు తీసేటప్పుడు తెలుగు డ్యాన్సర్లనే పెట్టుకోవాలని చెప్పారు. కానీ డబుల్ ఇస్మార్ట్ షూటింగ్‌లో ఎక్కువగా ముంబైకి చెందిన డ్యాన్సర్లను వాడినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ చిత్రానికి జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ కావడంతో ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వివరణ ఇచ్చారు. ముంబైలో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఓ పాటకు చిత్రీకరించాలని పూరీ జగన్నాథ్ నిర్ణయించి.. ఓ 200 మంది డ్యాన్సర్లు కావాలని తనకు చెప్పారని, ఈ విషయాన్ని నిర్మాత ఛార్మి దృష్టికి తీసుకెళ్లినట్లు జానీ మాస్టర్ తెలిపారు.
కానీ ఛార్మి మాత్రం 200 మందిని తాను భరించలేనని.. 110 మందికి పర్మిషన్ ఇచ్చారని చెప్పారు. 110 మంది డ్యాన్సర్లను తీసుకోవాలనుకున్న టాలీవుడ్ డ్యాన్సర్ల యూనియన్‌లో ఓ రూల్ ఉందని.. ఎక్కువ మంది డ్యాన్సర్లుగా తెలుగువాళ్లని పెట్టుకోవాలని .. అది కూడా హైదరాబాద్ నుంచి రప్పించాలని ఛార్మికి చెప్పానని జానీ మాస్టర్ పేర్కొన్నారు. ఆ మాట వినగానే.. తాను ఇప్పుడు నష్టాల్లో ఉన్నానని చెప్పారు.
డ్యాన్సర్లను అంతమందిని హైదరాబాద్ నుంచి రప్పించి వాళ్ల ట్రావెల్, ఫుడ్ ఖర్చులు తాను భరించలేనని .. హైదరాబాద్‌లో షూటింగ్ చేసినప్పుడు ఎక్కువ మందిని అక్కడి నుంచే తీసుకున్నాం కదా అని చెప్పారని జానీ మాస్టర్ తెలిపారు. 20 మందినైనా తెచ్చుకుందాం అని చెప్పానని.. దానికి ఛార్మి ఓకే అన్నారని ఆయన వెల్లడించారు. సరిగ్గా అదే సమయంలో డ్యాన్సర్ యూనియన్ ఎన్నికలు జరుగుతుండటంతో .. ముంబై వాళ్లనే పెట్టుకోవాల్సి వచ్చిందని జానీ మాస్టర్ వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











