Jani Master : జానీని ఇరికించారు .. వాళ్లెవరో బయటపెడతాం, స్టార్ కొరియోగ్రాఫర్ షాకింగ్ కామెంట్స్
లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయినా టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను పోలీసులు గోవా నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. నగరంలోని రహస్య ప్రదేశంలో ఆయనను విచారించిన పోలీసులు అనంతరం ఆయనను ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ పరిణామాలతో కేసు ఎటు మలుపు తిరుగుతుందోనని టాలీవుడ్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. జానీ మాస్టర్ కేసుపై కొరియోగ్రాఫర్ నటరాజ్ మాస్టర్ స్పందించారు. ఈ వివరాల్లోకి వెళితే..
తనపై జానీ మాస్టర్ అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా ఓ మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేయడంతో ఆయనపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో పోలీసుల దర్యాప్తులో అనేక కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఇదే సమయంలో జానీ మాస్టర్‌పై పోక్సో చట్టం కింద కేసు పెట్టడం మరింత కలకలం రేపింది. దీంతో ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది.

తనపై ఆరోపణలు రావడం, పోలీసులు వేట మొదలుపెట్టడంతో జానీ మాస్టర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గోవాలోని ఓ లాడ్జిలో ఆయన ఉన్నట్లుగా పక్కా సమాచారం అందడంతో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఇక్కడి నుంచి అసలు దర్యాప్తు ప్రారంభం కానుంది. ఈ పరిణామాల నేపథ్యంలో జానీ మాస్టర్‌పై చర్యలకు దిగారు టాలీవుడ్ పెద్దలు, ఇండస్ట్రీలో అతని సభ్యత్వాల్ని రద్దు చేయడంతో పాటు.. లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ కూడా జానీ కేసును విచారణకు తీసుకుంది. ఇక మహిళా సంఘాలేతై ఆయనపై విరుచుకుపడుతున్నాయి. జనసేన పార్టీ ఇప్పటికే ఆయనను క్రియాశీలక వ్యవహారాలకు దూరంగా ఉండాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.
జానీ మాస్టర్ కేసుపై తోటి కొరియోగ్రాఫర్లు స్పందిస్తున్నారు. ఆట సందీప్ సతీమణి జ్యోతిరాజ్ స్పందిస్తూ... ఇలాంటి ఘటనల్లో నిందితులు ఏ స్థాయిలో ఉన్నా వదిలిపెట్టకూడదన్నారు. కానీ చట్టాలను ఉపయోగించుకుని.. ఓ వ్యక్తి కష్టపడి సంపాదించుకున్న పేరుని, ఇమేజ్‌ను చెడగొట్టాలనుకునే అమ్మాయిల్ని కూడా శిక్షించాలని జ్యోతి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అయిపోతున్నారని.. నిజం ఏదో ఒక రోజు బయటికి వస్తుందని జ్యోతి అభిప్రాయపడ్డారు.
తాజాగా మరో కొరియోగ్రాఫర్ నటరాజ్ మాస్టర్ స్పందించారు. జానీ మాస్టర్‌ను కావాలనే ఈ కేసులో ఇరికించారని, రెండు రోజుల్లో పూర్తి విషయాలు బయటికొస్తాయని చెప్పారు. ఎవరు ఇరికించారో ఆధారాలు బయటపెడతామని.. ఆరోపణలు చేసిన యువతి ఎదగడానికి జానీయే కారణమని నటరాజ్ తెలిపారు. జానీ మాస్టర్ అందరితో బాగుంటారని.. కానీ కొరియోగ్రఫీ చేసే సమయంలో మాత్రం సీరియస్‌గా ఉంటారని చెప్పారు.
ఐదారేళ్లుగా జరుగుతుందని అంటున్నప్పుడు ఇప్పుడే ఎందుకు వెలుగులోకి వచ్చిందని నటరాజ్ మాస్టర్ ప్రశ్నించారు. జానీ మాస్టర్ కెరీర్‌లో పీక్స్‌లో ఉన్నారని.. పొలిటికల్‌గానూ యాక్టీవ్‌గా ఉన్న సమయంలో ఇలాంటివి సహజమేని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికే పలువురు కొరియోగ్రాఫర్లు ఇదే రకమైన ఆరోపణలు చేయగా, నటరాజ్ కూడా కుట్ర కోణం ఉందని అభిప్రాయపడటంతో జానీ మాస్టర్ కేసు ఎటువైపు మలుపు తిరుగుతోందనన్న ఉత్కంఠ నెలకొంది.


Click it and Unblock the Notifications











