అవార్డ్ ఎందుకు రాదో చూస్తా .. జానీ మాస్టర్ వెంటే, స్టార్ కొరియోగ్రాఫర్ సంచలన వ్యాఖ్యలు
టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ యువ మహిళ డ్యాన్స్ మాస్టర్ చేసిన ఆరోపణలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆమె ఫిర్యాదుతో నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి గోవాలో తలదాచుకున్న జానీ మాస్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆయనకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించగా, తర్వాత బెయిల్ మంజూరు చేసింది. అన్నింటిలోకి జానీ మాస్టర్ నేషనల్ అవార్డ్ నిలిచిపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.
జానీ మాస్టర్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు 4 రోజుల పాటు విచారించి కీలక విషయాలు రాబట్టారు. అయితే మాస్టర్‌పై థర్డ్ డిగ్రీ ప్రయోగించొద్దని, ఆయన లాయర్ సమక్షంలోనే విచారణ నిర్వహించాలని పోలీసులకు కోర్ట్ గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బెయిల్ పొందేందుకు జానీ మాస్టర్ తీవ్రంగా ప్రయత్నించారు. కోర్టులో విషయం ఉండగానే జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డ్‌కు జానీ ఎంపికయ్యారు. 2022 సంవత్సరానికి గాను కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన తిరుచిత్రంబలం సినిమాకు గాను ఆయనను బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా భారత ప్రభుత్వం ఎంపిక చేసింది.

ఈ క్రమంలోనే అక్టోబర్ 8న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగే అవార్డుల ప్రదానోత్సవానికి వెళ్లేందుకు గాను తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా జానీ మాస్టర్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం అక్టోబర్ 6 నుంచి 9 వరకు మధ్యంతరం బెయిల్ మంజూరు చేసింది. కానీ ఇక్కడే ఊహించని పరిణామం చోటు చేసుకుంది. జానీపై లైంగిక వేధింపులు, పోక్సో వంటి బలమైన కేసులు నమోదు కావడంతో నేషనల్ ఫిల్మ్ అవార్డ్ సెల్ కీలక ప్రకటన చేసింది. జానీ మాస్టర్ అవార్డును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది.
అయితే జానీకి నేషనల్ అవార్డ్ నిలిపివేయడం పట్ల తోటి కొరియోగ్రాఫర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జానీ ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారని, అలాంటి వ్యక్తి జీవితాన్ని నాశనం చేశారని వారు ఆరోపిస్తున్నారు. మాస్టర్‌ను పొగిడిన అమ్మాయే ఇప్పుడెందుకు కేసు పెట్టిందని ప్రశ్నిస్తున్నారు. కోర్ట్ తీర్పు వచ్చే వరకు జానీపై ఆరోపణలు నమ్మేది లేదని చెబుతున్నారు. ఇదే సమయంలో జానీ మాస్టర్‌కు ప్రకటించిన నేషనల్ అవార్డ్‌ను తిరిగి ఎలా రప్పించాలనే దానిపై తెలుగు కొరియోగ్రాఫర్ల యూనియన్ కసరత్తు ప్రారంభించింది.

తాజాగా మరో కొరియోగ్రాఫర్ రాధ మాస్టర్ ఈ వ్యవహారంపై స్పందించారు. నేషనల్ అవార్డ్ అందుకోవడానికి జానీ అర్హుడని , ఆయనికి తప్పకుండా వస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. బాధితురాలి వెనుక ఎవరో ఉండి ఇదంతా చేయిస్తున్నారని రాధ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నార్త్ ఇండియా నుంచి వచ్చి టాలీవుడ్‌లో ఈ స్థాయిలో ఆ అమ్మాయి పేరు తెచ్చకోవడానికి జానీయే కారణమని రాధ అన్నారు. నిజం నిరూపించి జానీ మాస్టర్ తిరిగి వస్తారని , ఆయన కోసం తామంతా కలిసి పోరాటం చేస్తామమని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం రాధ మాస్టర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











