క్రిస్టఫర్ నోలన్‌కు కరోనా షాక్.. మరోసారి టెనెట్ రిలీజ్ వాయిదా
హాలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ రూపొందించిన టెనెట్ చిత్రానికి మరోసారి కరోనావైరస్ ఝలక్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో కోవిడ్ 19 పరిస్థితులు తీవ్రంగా ఉండటంతో ఈ చిత్ర విడుదలను వార్నర్ బ్రదర్స్ వాయిదా వేసింది. సుమారు 200 మిలియన్ డాలర్ల వ్యయంతో రూపొందిన ఈ చిత్రాన్ని జూలై 17వ తేదీన రిలీజ్ చేయాలని తొలుత నిర్ణయించారు. ఆ తర్వాత జూలై 31కి రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ తాజా పరిస్థితులను బేరీజు వేసుకొని ఆగస్టు 12వ తేదీన రిలీజ్ చేయాలని నిర్ణయించారు.
వార్నర్ బ్రదర్స్ ప్రతినిధులు ఈ విషయంపై స్పందిస్తూ.. టెనెట్ చిత్రాన్ని థియేటర్లలోనే, భారీ తెర మీద రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నాం. కరోనా పరిస్థితులు ఇక లేవని నిర్ణయించుకొన్న తర్వాతనే ఎగ్జిబిటర్లు, ఆరోగ్యశాఖ అధికారుల క్లియరెన్స్ తర్వాతనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని తెలిపారు.

కరోనా పరిస్థితులను బట్టి మా నిర్ణయాలను మార్చుకొంటున్నాం. వాస్తవానికి జూలై 31 నాటికి నోలన్ చిత్రం ఇన్‌సెప్షన్ రిలీజ్ అయి 10 ఏళ్లు పూర్తి చేసుకొంటుంది. ఆ ప్రత్యేకమైన రోజును గుర్తు చేసుకొంటూ టెనెట్‌ను రిలీజ్ చేయాలని అనుకొన్నాం. కానీ పరిస్థితులు రిలీజ్‌కు అనుకూలంగా లేవు అని క్రిస్టఫర్ నోలన్ పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, లాక్‌డౌన్ ఎత్తివేతకు సంబంధించి.. నాలుగో దశలో థియేటర్లను రీఓపెన్ చేయకూడదని అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం కూడా ఈ సినిమా వాయిదాకు మరో కారణం అని తెలిసింది.


Click it and Unblock the Notifications











