సినిమా బండికి బ్రేకుల్లేవు.. టాప్ ట్రెండింగ్ లోకి!
తెలుగు ప్రేక్షకులు కూడా మారుతున్నారు. ఒకప్పుడు సినిమాలు అంటే ఒక మూస ఫార్ములాతో నడిచిపోయేవి కానీ ఇప్పుడు తెలుగులో కూడా వైవిధ్యమైన కథలతో విభిన్నమైన సినిమాలను చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్రేక్షకులు కూడా విభిన్నమైన సినిమాలను ఆదరించడం మొదలుపెట్టారు. కేరాఫ్ కంచరపాలెం, మల్లేశం, మిడిల్ క్లాస్ మెలోడీస్ తర్వాత మన తెలుగు సినిమా అని అనిపించేలా ఉన్న సినిమా బండి ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటోంది. ఆ వివరాల్లోకి వెళితే

అందరూ కొత్త వాళ్లే
వికాస్ వశిష్ఠ, సందీప్, రాగ్ మయూర్, ఉమ ప్రధాన పాత్రల్లో ప్రవీణ్ కంద్రేగుల దర్శకత్వంలో రూపొందిన ఇండిపెండెంట్ మూవీ 'సినిమా బండి'. ఫ్యామిలీమ్యాన్ వెబ్ సిరీస్ ఫేమ్ దర్శకద్వయం రాజ్ అండ్ డీకే ఈ సినిమాని నిర్మించారు. ఈ నెల 14 నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ సినిమా బండి బ్రేకులు లేకుండా దూసుకుపోతోంది.

అందుకే నిర్మించాం
ఇక తాజా ఇంటర్వ్యూలో రాజ్ డీకే మాట్లాడుతూ ప్రవీణ్ మా దగ్గర వర్క్ చేయలేదని, కానీ 'సినిమా బండి' కంటెంట్, ప్రవీణ్ పాత షార్ట్ ఫిల్మ్స్ నచ్చి ఈ సినిమాను నిర్మించామని అన్నారు. కొత్తవాళ్ల ప్రతిభను నమ్మి, మా డబ్బులతోనే చిన్న సినిమాలను ప్రోత్సహించాలనుకున్నామని వేరే బ్యానర్ దగ్గరకు వెళితే వాళ్ల జోక్యంతో క్రియేటివ్ పరంగా ఇబ్బందులు వస్తాయనుకుని 'డీటుఆర్ ఇండీ' ప్లాట్‌ఫామ్‌ను మొదలు పెట్టి ఈ సినిమా బండి' నిర్మించామని పేర్కొన్నారు. ఈ సినిమాకి వ్యూయర్స్ నుంచి మంచి స్పందన రావడం ఆనందంగా ఉందని అన్నారు.

కంటెంట్ ఈజ్ కింగ్
తెలుగు ప్రేక్షకులకు మంచి కంటెంట్ అందిస్తే కచ్చితంగా ఆదరిస్తారు అని గతంలో రిలీజయిన కేరాఫ్ కంచరపాలెం మల్లేశం మిడిల్ క్లాస్ మెలోడీస్ ఇలాంటి సినిమాలు నిరూపించాయి. ఇప్పుడు అదే కోవలో సినిమా బండి కూడా ప్రేక్షకుల విశేష ఆదరణ చూరగొంది. నిజానికి ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ చేసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు కానీ, తెలుగు రాష్ట్రాలలో లాక్ డౌన్ కారణంగా తెలుగు ప్రజలు అందరూ ఇళ్లకే పరిమితం అయిపోయిన నేపథ్యంలో ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్ లో నిలిచింది.

నెట్ ఫ్లిక్స్ టాప్ 1
షార్ట్ ఫిల్మ్స్ దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల తెరకెక్కించిన ఈ సినిమా బండి కంటెంట్ ప్రేక్షకులను మెప్పించడంతో నెట్ ఫ్లిక్స్ లో ట్రెండీ మూవీగా నిలిచింది. రాయల సీమలోని ఒక మారుమూల గ్రామంలో ఒక ఆటో డ్రైవర్ కు హై అడ్వాన్స్డ్ కెమెరా దొరుకుతుంది. తన స్నేహితుడైన స్టిల్ ఫోటోగ్రాఫర్ ను సంప్రదిస్తే ఇలాంటి కెమెరాతోనే సినిమాలు తీస్తారని చెబుతాడు.
అలా దగ్గరైంది
దీంతో మనం కూడా ఎందుకు సినిమా చేయకూడదు అనే ఆసక్తితో ఊరు అందరితో కలిసి ఒక సినిమా చేస్తారు. ఎవరు ఊహించని విధంగా గ్రామస్తులు అమాయకత్వం, రాయలసీమ యాస, సరిగ్గా అదే గ్రామానికి చెందినట్టు నటించిన నటీనటుల తీరు మొత్తంమీద ఈ సినిమాను ప్రేక్షకులకు బాగా దగ్గర చేసింది. అలా మొత్తం మీద ఈ సినిమా ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ ఇండియాలో టాప్ ట్రెండింగ్ లో నిలిచింది.


Click it and Unblock the Notifications











