గుంటూరు కారం నుంచి మరో వికెట్ డౌన్.. బొమ్మ తేడా కొడుతుందా ఏంటి!
టాలీవుడ్‌లో హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకడు. కొన్నేళ్ల పాటు వరుసగా హిట్లు మీద హిట్లు కొట్టిన అతడు.. గత చిత్రం 'సర్కారు వారి పాట'తో ఆశించిన సక్సెస్‌ను సొంతం చేసుకోలేకపోయాడు. దీంతో ఈ సారి ఎలాగైనా భారీ హిట్‌ను అందుకోవాలన్న పట్టుదలతో 'గుంటూరు కారం' చేస్తున్నాడు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తోన్న చిత్రమే 'గుంటూరు కారం'. పూర్తి స్థాయి మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంపై ఆరంభం నుంచే అంచనాలు భారీ స్థాయిలోనే నెలకొన్నాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ క్రేజీ మూవీని పర్‌ఫెక్ట్ ప్లానింగ్‌తో తెరకెక్కిస్తున్నారు.

వాస్తవానికి 'గుంటూరు కారం' మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ చాలా నెలల క్రితమే ప్రారంభం అయింది. కానీ, మధ్యలో అనుకోని అవాంతరాలు ఎదురు కావడంతో ఈ సినిమా షూటింగ్ సజావుగా సాగడం లేదు. దీంతో ఇది యాభై శాతం వరకూ మాత్రమే పూర్తి చేసుకోగలిగింది. ఫలితంగా అనుకున్న సమయానికి ఈ చిత్రం విడుదలయ్యే పరిస్థితులు కనిపించట్లేదు.
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న 'గుంటూరు కారం' మూవీకి సంబంధించి ఇప్పటికే చాలా మంది టెక్నీషియన్లు మారిపోయారు. ముఖ్యంగా ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా మధిని తీసుకున్నారు. ఆయన దీని నుంచి తప్పుకోవడంతో పీఎస్ వినోద్ రంగంలోకి దిగారు. ఇప్పుడు ఆయన కూడా ఈ చిత్రం నుంచి ఔట్ అయ్యారు. దీంతో మరొకరిని ఫైన్ చేశారు.

'గుంటూరు కారం' మూవీకి సంబంధించి ఇప్పుడు సినిమాటోగ్రాఫర్‌గా మనోజ్ పరమహంసను తీసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌ను ఆయనే షూట్ చేస్తున్నారు. ఇక, తాజా షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. ఇందులో ప్రకాశ్ రాజ్ ఆఫీస్‌కు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ మారడంతో విజువల్స్ ఏమైనా తేడా కొడతాయా అని కొందరు చర్చించుకుంటున్నారు.

ఇక, 'గుంటూరు కారం' సినిమాను హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చేస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇందులో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణ సహా ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతుంది.


Click it and Unblock the Notifications











