చిరంజీవి కోసం బాలీవుడ్ ప్రముఖుడు: తెలుగులో ఇది మూడో సినిమా మాత్రమే!
రీఎంట్రీలో జెట్ స్పీడుతో దూసుకుపోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. రాజకీయాల కోసం తీసుకున్న గ్యాప్‌ను త్వరగా పూర్తి చేయాలనుకుంటున్నారో ఏమో కానీ.. ఆయన వరుస పెట్టి ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నారు. ప్రస్తుతం కొరటాల శివ తెరకెక్కిస్తోన్న 'ఆచార్య'లో నటిస్తోన్న ఈ స్టార్ హీరో.. ఆ మూవీ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఇది పట్టాలపై ఉండగానే.. మరిన్ని చిత్రాలను ప్రకటించారు. ఇందులో మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన 'లూసీఫర్' రీమేక్ ఒకటి. తాజాగా ఈ మూవీ గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.
మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా మరో స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన 'లూసీఫర్' సూపర్ హిట్ అయింది. దీన్ని కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు బుధవారమే జరిగాయి. ఇక, ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ కూడా త్వరలోనే మొదలు కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ రీమేక్ మూవీ కోసం బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ నీరవ్ షాను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. గతంలో 'ధూమ్', 'ధూమ్2', 'రోబో 2.0', అజిత్ నటించిన 'బిల్లా' వంటి భారీ చిత్రాలకు ఆయన కెమెరామెన్‌గా పని చేశారు.

ఇక, తెలుగులో సిద్ధార్ద్ నటించిన 'లవ్ ఫెయిల్యూర్', 'సైజ్ జీరో' తర్వాత నీరవ్ షా చేస్తున్న మూడో చిత్రం 'లూసీఫర్' రీమేక్ మాత్రమే. ఆయన ఈ సినిమాకు ఎంతగానో ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా మలయాళంలో మోహన్ లాల్‌ను ఎంతో ఎలివేట్ చేసి చూపించారు. తెలుగులోనూ అదే ఫార్ములాను ఫాలో అయ్యేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. అందుకే బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్‌ను ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇక, ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.


Click it and Unblock the Notifications











