తెలుగు చిత్ర సీమలో మరో విషాదం: పవన్, ఎన్టీఆర్‌తో పని చేసిన ప్రవీణ్ కన్నుమూత
కొంత కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుస పెట్టి విషాదకర సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఎంతో మంది సినీ రంగానికి చెందిన ప్రముఖులు ప్రాణాలు విడిచారు. ఈ రెండు మూడు నెలల కాలంలోనే కృష్ణంరాజు, కృష్ణ, కే విశ్వనాథ్, కైకాల సత్యనారాయణ, నందమూరి తారకరత్న వంటి వంటి నటులను పరిశ్రమ కోల్పోయింది. అలాగే, ఎంతో మంది టెక్నీషియన్లు కూడా చనిపోయారు. దీంతో చిత్ర రంగానికి తీవ్ర లోటు ఏర్పడింది. ఈ క్రమంలోనే ఇప్పుడు టాలీవుడ్‌లో టాలెంటెడ్ కెమెరామెన్ ప్రవీణ్ అనుమోలు కన్నుమూశారు. దీంతో పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి.
చాలా కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో అసిస్టెంట్ కెమెరామెన్‌గా, కెమెరామెన్‌గా పని చేస్తోన్న టాలెంటెడ్ పర్సన్ ప్రవీణ్ అనుమోలు ఆదివారం రాత్రి కన్నుమూశారు. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోన్న ఆయనకు గత రాత్రి గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ప్రవీణ్ చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారని తెలిసింది. ఈయన మరణంపై సినీ ప్రముఖులంతా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.

ప్రవీణ్ అనుమోలు అసిస్టెంట్ కెమెరామెన్‌గా కెరీర్‌ను మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'పంజా', జూనియర్ ఎన్టీఆర్ 'యమదొంగ' చిత్రాలతో పాటు బాలీవుడ్‌లోనూ 'బేబీ', 'ధూమ్ 3', 'భాజీరావ్ మస్తానీ' వంటి చిత్రాలను అసిస్టెంట్ కెమెరామెన్‌గా వర్క్ చేశారు. ఈ క్రమంలోనే 2017లో వచ్చిన 'దర్శకుడు' అనే చిత్రంతో సినిమాటోగ్రాఫర్‌గా మారారు. అప్పటి నుంచి వరుసగా ఎన్నో చిత్రాలను చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్నారు. ఇప్పుడు కూడా ప్రవీణ్ అనుమోలు చాలా చిత్రాలను చేస్తోన్నారు. ఇలాంటి సమయంలో ఆయన మరణించారు.
ప్రవీణ్ అనుమోలు చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించడం అందరినీ కలిచి వేస్తుంది. ఇప్పటికే ఆయన పార్థీవ దేహాన్ని చూసేందుకు చాలా మంది సినీ ప్రముఖులు వెళ్లినట్లు సమాచారం. ఇక, ఆయన అంత్యక్రియులు సోమవారం హైదరాబాద్‌లోనే జరిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది.


Click it and Unblock the Notifications











