‘విరాట పర్వం’ విడుదలపై క్లారిటీ: దీన్ని కూడా అప్పుడే తీసుకొచ్చేందుకు ప్లాన్
టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా - టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి జంటగా.. వేణు ఉడుగుల రూపొందించిన చిత్రం 'విరాట పర్వం'. నక్సలైట్ ఉద్యమం నాటి నేపథ్యానికి చక్కని ప్రేమకథను జోడించి ఈ సినిమాను తెరకెక్కించారు. ఎంతో ప్రతిష్టాత్మంగా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే పూర్తైంది. కానీ, అనివార్య కారణాల వల్ల విడుదల మాత్రం తరచూ వాయిదా పడుతూనే వస్తోంది. ఈ క్రమంలోనే దీన్ని ఏప్రిల్‌లో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, కరోనా సెకెండ్ వేవ్ వల్ల అది సాధ్య పడలేదు. ఇక, తాజాగా ఈ మూవీ రిలీజ్‌పై క్లారిటీ వచ్చేసింది.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కరోనా ప్రభావం క్రమక్రమంగా తగ్గుతోంది. దీంతో ఇప్పటికే తెలంగాణలో లాక్‌డౌన్ ఎత్తేశారు. మరోవైపు, ఏపీలో కూడా కొద్ది రోజుల్లో పరిస్థితి సద్దుమణిగేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే షూటింగ్ పూర్తైన చిత్రాలన్నీ ఒక్కొక్కిటిగా విడుదల కానున్నాయి. ఈ క్రమంలోనే ప్యూర్ లవ్ స్టోరీతో రాబోతున్న 'విరాట పర్వం' చిత్రాన్ని ఈ ఆగస్టులో విడుదల చేయాలని యూనిట్ భావిస్తున్నట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. అప్పటికైతే వంద శాతం ఆక్యూపెన్సీ ఉండే అవకాశం ఉన్నందువల్లే ఈ చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకుందని తెలిసింది.

మరోవైపు.. ఇదే నెలలో నాగ చైతన్య నటించిన 'లవ్ స్టోరీ', నేచురల్ స్టార్ నాని చిత్రం 'టక్ జగదీష్'లు విడుదల కాబోతున్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. వీటికి ఓ వారం గ్యాప్‌లోనే 'విరాట పర్వం' మూవీని కూడా విడుదల చేయాలని చూస్తున్నారట. ఆ రెండు చిత్రాల రిలీజ్ డేట్లు ప్రకటించగానే.. ఈ మూవీ విడుదల తేదీని కూడా అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది. ఇక, ఈ సినిమాను ఎస్‌ఎల్‌వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. నివేదా పెతురాజ్, ప్రియమణి, నందితాదాస్, నవీన్‌చంద్ర, జరీనా వహాబ్, ఈశ్వరీరావు, బెనర్జీ ప్రధాన పాత్రలు చేశారు.


Click it and Unblock the Notifications











