CM Vijay Salary: జన నాయగన్‌కు 220 కోట్ల రెమ్యునరేషన్.. ముఖ్యమంత్రిగా విజయ్‌కి జీతమెంత?
కోలీవుడ్ సూపర్‌స్టార్‌గా వెండితెరపై తిరుగులేని నటుడిగా వెలుగొందారు దళపతి విజయ్. 30 ఏళ్ల పాటు తనదైన నటనతో ప్రేక్షకులను అలరించిన ఆయన.. రాజకీయాల్లోకి ప్రవేశించి తన టీవీకే పార్టీతో ప్రభంజనం సృష్టించారు. ద్రవిడ రాజకీయ దిగ్గజాలు డీఎంకే, అన్నాడీఎంకేలను ఎన్నికల్లో మట్టికరిపించి పార్టీ స్థాపించిన తొలి ఎన్నికలోనే ముఖ్యమంత్రిగా నిలిచిన నటుడిగా ఏపీ మాజీ సీఎం నందమూరి తారక రామారావు సరసన చేరారు విజయ్. మే 10న తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన ప్రస్తుతం తన టీమ్‌ని రెడీ చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. అయితే సూపర్‌స్టార్‌గా వందల కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న విజయ్.. ముఖ్యమంత్రిగా ఎంత వేతనం అందుకోనున్నారు? అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివరాల్లోకి వెళితే..
తమిళ చిత్ర పరిశ్రమలో రజనీకాంత్ తర్వాత అంతటి ఫాలోయింగ్ ఉన్న మాస్ హీరోగా నిలిచారు దళపతి విజయ్. ఒకదశలో వరుస హిట్స్, బాక్సాఫీస్ కలెక్షన్స్‌తో రజనీకాంత్‌ను దాటేసి నెంబర్‌వన్ హీరోగా నిలిచారు విజయ్. ఇన్నేళ్లుగా తనను ఆదరించిన తమిళ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి ప్రవేశించి తమిళగ వెట్రి కజగం (టీవీకే)ను స్థాపించారు. సెక్యులర్, సోషల్ జస్టిస్ నినాదంతో ప్రజల్లోకి వెళ్లారు విజయ్. తన చేతిలో ఉన్న జన నాయగన్ సినిమాను వేగంగా పూర్తి చేశారు. ఇదే తన చివరి చిత్రమని ఇకపై పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటానని మలేషియాలో జరిగిన జన నాయగన్ ఆడియో లాంచ్‌లో ప్రకటించారు. అయితే సెన్సార్ సమస్యల కారణంగా ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు.

రాష్ట్రవ్యాప్తంగా విజయ్ సుడిగాలి పర్యటనలు చేశారు. వరుసపెట్టి సభలు, సమావేశాలు, రోడ్ షోలతో అధికార డీఎంకే, సీఎం ఎంకే స్టాలిన్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేనివారికి, పేదలకు టికెట్లు కేటాయించి విమర్శకుల ప్రశంసలు పొందారు. ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకేలు సర్వశక్తులు ఒడ్డినప్పటికీ తమిళ ప్రజలు మాత్రం విజయ్ వెంటే నిలిచారు. తిరుచ్చి ఈస్ట్, పెరంబూర్‌లలో పోటీ చేసిన విజయ్‌ని భారీ మెజారిటీతో గెలిపించడంతో పాటు టీవీకేకు 108 సీట్లకు కట్టబెట్టారు.
అయితే అధికారం అందుకోవడానికి కావాల్సిన మరో 11 సీట్ల విషయంలో గందరగోళం నెలకొంది. గవర్నర్ నుంచి ప్రభుత్వ ఏర్పాటుకు ఆమోదం లభించకపోవడంతో పాటు పార్టీల మద్ధతు కూడగట్టడంలో విజయ్ ఇబ్బందిపడ్డారు. చివరికి కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీఎకే, ఐయూఎంల్ పార్టీల మద్ధతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. వారం రోజుల పాటు తమిళనాడులో నెలకొన్న పొలిటికల్ హైడ్రామాకు తెరదించుతూ చెన్నై నెహ్రూ ఇండోర్ స్టేడియంలో తమిళనాడు 9వ ముఖ్యమంత్రిగా చంద్రశేఖర్ జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కృషి చేస్తానని, సుపరిపాలన అందిస్తానని విజయ్ తెలిపారు. సెక్రటేరియట్‌లో నిరాడంబరంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ప్రశంసలు పొందారు దళపతి.
ఇదిలాఉండగా.. అగ్ర కథానాయకుడిగా రెమ్యునరేషన్ విషయంలో రికార్డులు సృష్టించారు దళపతి విజయ్. తన చివరి సినిమా జన నాయగన్‌కు ఏకంగా 220 కోట్ల రూపాయల పారితోషికం అందుకుని తమిళ చిత్ర పరిశ్రమలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న నటుడిగా నిలిచారు. మరి సీఎంగా విజయ్ జీతమెంత? నెలకు ఆయన ఎంత సంపాదిస్తారు? అనే ఆసక్తి నెలకొంది. సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి తమిళనాడు ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ నెలకు 2,05,000 లక్షల వేతనాన్ని అందుకోనున్నారు. దానికి ఇతర అలవెన్సులు కలుపుకుని నెలకు 2,85,000 అందుకుంటారు. అంటే ఏడాదికి 34.2 లక్షల రూపాయలు. ప్రభుత్వ క్యాంప్ కార్యాలయం, జెడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీతో పాటు ఇతర సౌకర్యాలు విజయ్‌కి లభిస్తాయి.


Click it and Unblock the Notifications


