మనోడు మంచి ఖిలాడీ.. ఓంకార్‌పై అలీ ఆసక్తికర వ్యాఖ్యలు
బుల్లితెర యాంకర్, నటుడు, దర్శకుడు ఓంకార్ పై కమెడియన్ అలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓంకార్ రూపొందిస్తున్న రాజుగారి గది 3 సినిమాలో అలీ ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో డైరెక్టర్ ఓంకార్ పై అలీ చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యపరిచాయి.
ఓంకార్ మంచి ఖిలాడీ అని పేర్కొంటూ ఆయన గురించిన కొన్ని విషయాలు పంచుకున్నాడు అలీ. తాను గత 40 ఏళ్లలో చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే 'రాజుగారి గది 3' మరో ఎత్తు అని చెబుతూ.. ఓంకార్ దర్శకత్వ ప్రతిభను కొనియాడాడు అలీ. విభిన్నమైన భావోద్వేగాలున్న పాత్రను తన కోసం రాశాడని చెప్పాడు. ఓ దర్శకుడిగా తనకు ఏం కావాలో ఓంకార్ లో క్లారిటీ ఉందని, అదే విధంగా ఔట్ పుట్ ఎలా రాబట్టుకోవాలో బాగా తెలిసిన డైరెక్టర్ ఓంకార్ అని చెప్పాడు. రాజు గారి గది సిరీస్‌లో వచ్చిన తొలి రెండు భాగాల కంటే ఈ మూడో భాగం ఇంకా అలరిస్తుందని, ఛోటా కె.నాయుడు విజువల్స్ ఈ సినిమాలో హైలైట్‌గా నిలుస్తాయని అలీ చెప్పాడు.

డిఫెరెంట్ జానర్‌లో హారర్ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనతో 'రాజుగారి గది' సిరీస్ మొదలు పెట్టిన ఓంకార్.. వరుసగా రెండు భాగాలు రిలీజ్ చేసి అదే బాటలో మూడో భాగం 'రాజుగారి గది 3' ని కూడా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు రెడీ అయ్యాడు. ఈ చిత్రంలో ఓంకార్ సహా అవికా గోర్, అశ్విన్ బాబు, అలీ, ధన్‌రాజ్, అజయ్ ఘోష్, ఊర్వశి, ప్రభాస్ శ్రీను, హరితేజ ముఖ్యపాత్రలు పోషించారు. షబీర్ సంగీతం సమకూర్చారు. అక్టోబర్ 18న ఈ సినిమా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











