నిర్మాతగా మారిన కృష్ణుడు.. మై బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్ అంటూ
హాస్య నటుడిగా, హీరోగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకొన్న కృష్ణుడు కొత్త అవతారం ఎత్తారు. పలు చిత్రాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పించిన కృష్ణుడు నిర్మాతగా మారారు. తన కుమార్తె పేరు మీద నిత్యా క్రియేషన్స్ బ్యానర్‌ను ప్రారంభించారు. తన నిర్మాణ సంస్థలో తొలి ప్రయత్నంగా మై బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్ అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా లోతుగడ్డ జయరామ్‌ను కృష్ణుడు తెలుగు తెరకు పరిచయం చేయబోతున్నారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతున్నది.
మై బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ చిత్రం గురించి నటుడు కృష్ణుడు వివరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ''నేటి యువత భావాలకు అద్దం పట్టేలా 'మై బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్' సినిమా ఉంటుంది. కథ, కథనాలు సరికొత్తగా ఉంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే విధంగా అన్ని అంశాలతో సినిమా తెరకెక్కించాం. ఫైనల్ అవుట్‌పుట్ చూశాక సంతృప్తిగా అనిపించింది. తెలుగు ప్రేక్షకులు నటుడిగా నన్నెంతో ఆదరించారు. నిర్మాతగా ప్రయాణం ప్రారంభిస్తున్నాను. ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నా. త్వరలో మిగతా వివరాలు వెల్లడిస్తా'' అని అన్నారు.

నటుడు కృష్ణుడు కెరీర్ విషయానికి వస్తే.. మొదటి సినిమా అనే చిత్రంతో కెరీర్ ప్రారంభించిన కృష్ణుడు 'వినాయకుడు', 'విలేజ్‌లో వినాయకుడు' చిత్రాలతో మంచి గుర్తింపు పొందారు. హ్యాపీ డేస్, పోకిరి, ఆర్య 2, ఏం మాయ చేశావే, మిస్టర్ పర్‌ఫెక్ట్ చిత్రాలతో ప్రతిభావంతుడైన నటుడిగా పేరు తెచ్చుకొన్నారు. ప్రస్తుతం కృష్ణుడు నిర్మాతగా తన అదృష్ణాన్ని పరీక్షించుకొనేందుకు సిద్దమయ్యారు.


Click it and Unblock the Notifications