కరోనాపై పోరాటం.. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆర్ధిక సాయం
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఓ వైపు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం కలవరపెడుతోంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ లాక్‌డౌన్ విధించారు. పెద్ద ఎత్తున కరోనా నివారణ చర్యలు చేపడుతున్నాయి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు.
ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారిపై పోరాటానికి తెలుగు చిత్రసీమ నుంచి మద్దతు పెరుగుతోంది. పలువురు సినీ ప్రముఖులు ముఖ్యమంత్రుల సహాయనిధికి తమ తమ ఆర్థిక సాయం అందజేస్తూ గొప్ప మనసు చాటుకుంటున్నారు. ఇప్పటికే నితిన్, పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, రామ్ చరణ్ ముఖ్యమంత్రుల సహాయ నిధులకు ఆర్థిక సాయం ప్రకటించారు.

తాజాగా డైరెక్టర్ అనిల్ రావిపూడి ముందుకొచ్చి రెండు తెలుగు రాష్ట్రాలకు తన వంతుగా మొత్తం రూ. 10 లక్షలు విరాళం ప్రకటించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధులకు చెరో రూ. 5 లక్షలు అందజేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగమవుతున్న ప్రభుత్వాలకు తమ సహకారం ఉంటుందని అన్నారు. ప్రజలందరూ సామాజిక దూరం పాటిస్తూ, ఇళ్లల్లో ఉండి లాక్‌డౌన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా అనిల్ రావిపూడి కోరారు.


Click it and Unblock the Notifications











