పరిస్థితులు చక్కబడ్డాకే ప్రభాస్ 20 అప్డేట్.. నిర్మాణ సంస్థ ట్వీట్
ప్రపంచం ఓ పక్క చెల్లాచెదురు అవుతున్నా గానీ హీరోల అభిమానులకు మాత్రం వారికి కావాల్సింది రావాల్సిందే. ఈ లెక్కలో ప్రభాస్ ఫ్యాన్స్‌ది మాత్రం ఎడారిలో ఎండమావుల్లానే తయారైంది. సాహో వచ్చి చాలా రోజులే అవుతోంది. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ జరుగుతూనే వస్తోంది. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఒక్క అప్డేట్ కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తూనే ఉన్నారు.
మధ్యలో ఉగాది, శ్రీరామ నవమి వంటి ప్రత్యేక పండగలు వెళ్లిపోయాయి. ఉగాదికి ఆర్ఆర్ఆర్ అప్డేట్ వచ్చిన సమయంలోనూ ప్రభాస్ ఫ్యాన్స్ యూవీ క్రియేషన్స్‌పై ఫైర్ అయ్యారు. ఇక అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ విడుదల చేస్తామని మైత్రీ మూవీస్ ప్రకటించాక యూవీపై డార్లింగ్ ఫ్యాన్స్ తాకిడి ఎక్కువైంది.

దెబ్బకు దిగొచ్చిన యూవీ క్రియేషన్స్ కుండబద్దలు కొట్టేసినట్టు ఓ విషయాన్ని చెప్పేసింది. ప్రస్తుతం కరోనా వైరస్ ధాటికి ప్రపంచమంతా అల్లకల్లోమైపోతోందని అందరూ దిక్కుతోచని స్థితిలో ఉన్నారని చెప్పుకొచ్చింది. ఇలాంటి విపత్కర సమయంలో మా కార్యకలాపాలన్నింటిని ఆపేశామని తెలిపింది. ఒక్కసారి ఈ పరిస్థితి చక్కబడ్డాక మీకు చాలా చాలా అప్డేట్స్ ఇస్తామని తెలిపింది. అంతవరకు అందరూ ఇంట్లోనే ఉండండి.. క్షేమంగా ఉండండని కోరింది.


Click it and Unblock the Notifications











