SSMB28: మహేశ్ మూవీ కోసం కళ్లు చెదిరే సెట్.. టాలీవుడ్ చరిత్రలో గొప్ప రికార్డు
తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ.. సుదీర్ఘ కాలంగా టాప్ హీరోగా సత్తా చాటుతోన్నాడు హ్యాండ్సమ్ హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు. కెరీర్ ఆరంభం నుంచీ వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తోన్న అతడు.. ఈ మధ్య కాలంలో వరుస విజయాలను ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతోన్నాడు. ఈ ఉత్సాహంతోనే మరిన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటోన్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు 'అతడు', 'ఖలేజా' వంటి క్రేజీ మూవీల తర్వాత మహేశ్ బాబు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి ఓ చిత్రాన్ని చేస్తోన్నాడు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ - మహేష్ బాబు నటిస్తోన్న సినిమా రెగ్యూలర్ షూటింగ్ గత ఏడాదిలోనే ప్రారంభం అయింది. ఆ వెంటనే దీనికి సంబంధించిన మొదటి షెడ్యూల్‌ను కూడా విజయవంతంగా కంప్లీట్ చేసుకున్నారు. అయితే, ఆ తర్వాత మహేశ్ బాబు వరుస విషాదాలను ఎదుర్కోవడంతో పాటు అనివార్య కారణాల వల్ల షూటింగ్ సజావుగా సాగలేదు. ఇక, ఇటీవలే ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ను మొదలు పెట్టారు. దీన్ని శరవేగంగా జరుపుతూ వచ్చారు. ఇది పూర్తైన వెంటనే సూపర్ స్టార్ ఇప్పుడు తన పర్సనల్ ట్రిప్‌కు వెళ్లాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో సెన్సేషన్ అవుతోంది.

సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ ఏకంగా భారీ సెట్‌ను నిర్మిస్తుందట. దీని కోసం ఏకంగా రూ. 12 కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలిసింది. అంతేకాదు, దీన్ని కొన్ని వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారని తెలిసింది. ఇంత పెద్ద సెట్‌ను (విస్తీర్ణం) ఇప్పటి వరకూ టాలీవుడ్‌లో ఏ సినిమాకూ వేయలేదని అంటున్నారు. దీంతో మహేశ్ బాబు ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. ఇక, ఈ సెట్‌లో మహేశ్ బాబు ఫ్యామిలీ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారని తెలిసింది.
ఈ సినిమాను హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. ఇక, దీనికి 'అర్జునుడు', 'అతడే పార్థు' వంటి టైటిళ్లు పరిశీలిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టు 11న రిలీజ్ చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











