దృశ్యం 2.. వెంకటేష్ తో పాటు మరో స్టార్ హీరో కూడా
దృశ్యం 2 సినిమా ఇటీవల మలయాళంలో విడుదలైన విషయం తెలిసిందే. మొహన్ లాల్, మీన నటించిన ఆ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలయ్యింది. అయితే ఆ సినిమాను తెలుగులో వెంకటేష్ రీమేక్ చేయబోతున్నారు. చాలా వరకు దృశ్యంలో నటించిన వారే దృశ్యం 2లో నటిస్తున్నారు. అయితే సీక్వెల్ లో మాత్రం మరిన్ని కొత్త పాత్రలు దర్శనమిస్తాయట.
తెలుగులో మొదట దృశ్యం సినిమాను సిరిప్రియ డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సారి మాత్రం కథ ఒరిజినల్ దర్శకుడు జీతూ జోసెఫ్ సీక్వెల్ ను రెడీ చేయడానికి సిద్ధమయ్యాడు. తెలుగు ఆడియెన్స్ అభిరుచికి తగ్గట్లు కొన్ని మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఊపందుకుంటున్నాయి.

అయితే సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో రానా దగ్గుబాటి కూడా కనిపిస్తాడని టాక్ వస్తోంది. గెస్ట్ రోల్ అని కాకుండా కథను మలుపు తిప్పే పాత్ర కోసం సెలెక్ట్ చేసుకున్నట్లు సమాచారం. గతంలో వెంకటేష్ రానా కలిసి నటించనున్నట్లు అనేక రకాల కామెంట్స్ వచ్చిన విషయం తెలిసిందే.
ఈ ఏడాది ఓ మల్టీస్టారర్ కథను కూడా స్టార్ట్ చేసే అవకాశం ఉందని కొన్ని ఇంటర్వ్యూలలో సురేష్ బాబు కూడా వివరణ ఇచ్చారు. ఇక మల్టీస్టారర్ సినిమా కంటే ముందే రానా వెంకీతో కలిసి కాసేపు స్క్రీన్ షేర్ చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. మరి సినిమా ఎంతవరకు హిట్టవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











