పవన్ కళ్యాణ్‌తో సినిమా... దాసరి చివరి కోరిక... హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మూడు దశాబ్థాల సినీ కెరీర్‌లో ప్రతి సినిమాను ప్రేక్షకుల ముందుకు విభిన్నంగా తీసుకురావడంతో పాటు తన వ్యక్తిత్వం, మంచి మనసుతో కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు పవన్ కళ్యాణ్. సినీ పరిశ్రమలో అగ్రనటుడిగా వెలుగొందుతున్నప్పటికీ తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రజల కోసం కెరీర్‌ను వదిలేసుకున్నారు పవన్. ఆయనతో సినిమా తీయాలని, కొత్తగా చూపించాలని ఎంతోమంది దర్శకుల కల అయితే.. పవన్‌తో కలిసి నటించాలని ఎంతోమంది హీరోయిన్ల కల. దర్శక దిగ్గజం, దివంగత దాసరి నారాయణరావు కూడా పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలన్న తన కల గురించి బతికున్న రోజుల్లో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని ఆయన మనవరాలు, హీరోయిన్ డింపుల్ హయతి తాజాగా బయటపెట్టారు.
తాత మనవడుతో చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు దర్శకరత్న దాసరి నారాయణరావు. ప్రపంచ చలనచిత్ర చరిత్రలో 150కి పైగా సినిమాలు డైరెక్ట్ చేసిన ఏకైక దర్శకుడిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. ఈ రికార్డును సమీప భవిష్యత్తులో బద్ధలు కొట్టడం అసాధ్యం. దర్శకునిగా కాకుండా స్క్రీన్ ప్లే రైటర్‌గా, నటుడిగా, రచయితగా, నిర్మాతగా, పాత్రికేయునిగా తెలుగు చిత్ర పరిశ్రమకు సేవలందించారు.

స్త్రీల హక్కులు, సామాజిక అంశాల చుట్టూనే దాసరి ఎక్కువగా సినిమాలు తీసేవారు. ఏ సినిమా తీసినా ఖచ్చితంగా సందేశం ఉండేది.. ఆయన చిత్రాలకు ఎక్కువగా మహిళా ప్రేక్షకులు అభిమానులుగా ఉండేవారు. దర్శకుడికి స్టార్ స్టేటస్ తెచ్చిన అరుదైన వ్యక్తిగా నిలిచారు. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కుగా.. ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నా అని ధైర్యం చెప్పేవారు. దాసరి మరణంతో ఆయన స్థానాన్ని భర్తీ చేసేవారు మరకొరు లేరంటే ఆయన వేసిన ముద్ర ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. ఇండస్డ్రీలో దాసరి వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన దాసరి అరుణ్ కుమార్ తండ్రి స్థాయిలో ముద్ర వేయలేకపోయారు.
ఇదిలాఉండగా.. యంగ్ హీరోయిన్ డింపుల్ హయతి తాను దర్శకరత్న దాసరి మనవరాలినని చెప్పి షాకిచ్చారు. రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రంలో డింపుల్ హీరోయిన్‌గా నటించారు. ఈ మూవీ ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దాసరి నారాయణరావు తనకు తాతగారు అవుతారని, అలాగే హీరోయిన్ ప్రభ తన నాయనమ్మ అని చెప్పడంతో సినీ వర్గాలు షాకయ్యాయి. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్‌తో సినిమా గురించి దాసరి గతంలో చెప్పిన మాటలను ఆమె గుర్తుచేసుకున్నారు.
ఇంట్లో సినిమా వాతావరణం ఉండటంతో నేను సెల్ఫీ తీసుకున్నా ఆ కోణంలోనే మాట్లాడి విశ్లేషించేవారు. దాసరి నారాయణరావు గారి చుట్టూ ఎప్పుడూ జనం ఉండేవారు. మొత్తం ఇండస్ట్రీ అంతా ఇంట్లోనే ఉండేది, ఇంటి బయటి కార్లు లైన్‌గా పార్క్ చేసి ఉండేవి. చిన్నప్పుడు ఆయన స్థాయేంటో నాకు తెలియలేదు.. పెరిగి పెద్దయి, దాసరిని కోల్పోయాక కూడా ఆయన విలువ తెలియదు. ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎవరికైనా ముందు తాతయ్యే గుర్తొచ్చేవారు. ఆయన చనిపోయేనాటికి నాది చాలా చిన్నవయసు అని డింపుల్ తెలిపారు.
చనిపోయేముందు తాతగారు పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలని ఉందని చెప్పారు. అలాగే దానికి కల్కి అనే టైటిల్ కూడా అనుకున్నారు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ కూడా రాసుకున్నారు. స్క్రిప్ట్ పేపర్స్ ఎప్పుడూ అక్కడే ఉండటంతో వాటిని నేను దొంగచాటుగా చదివాను. అప్పటికి నా వయసు 15 ఏళ్లే.. అప్పుడప్పుడే ఆఫర్లు వస్తున్న సంగతి తాతగారికి చెబితే... ఇండస్ట్రీకి ఎప్పుడు వెళ్లాలో నేను చెబుతాను అనేవారు. సడెన్‌గా ఒకరోజున తాతగారి ఆరోగ్యం బాగా క్షీణించింది. నేను ఖచ్చితంగా తిరిగొస్తాను, నేనే నీతో సినిమా తీస్తాను అన్నారు. చివరిగా దాసరిగారు చెప్పిన మాటల్ని నేను ఎప్పటికీ మరిచపోలేను. దాసరి గారు లెజెండ్.. ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి ఇంత చేశారని నాకు చిన్న వయసులో తెలియలేదు. ఆయన అవార్డ్స్ చూస్తున్నప్పుడు ఈ కాలంలో అలాంటివి మనం సాధించడం అసాధ్యమని డింపుల్ హయతి పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకవేళ పవన్‌తో దాసరి కనుక సినిమా చేసుంటే అది ఖచ్చితంగా ట్రెండ్ సెట్ చేసేదని మెగా అభిమానులు పోస్టులు పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











