Attack On Saif Ali Khan : సైఫ్ అలీఖాన్‌పై హత్యాయత్నం .. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌పై గుర్తు తెలియని దుండగుడు దాడి చేయడంతో చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. ముంబైలోని సైఫ్ ఇంట్లోకి చొరబడిన దుండగుడు.. ఆయనపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆయన తీవ్రగాయాల పాలయ్యాడు. సైఫ్ అలీఖాన్‌పై దాడితో చిత్ర పరిశ్రమ షాక్ అయ్యింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన కోలుకోవాలని ఆశిస్తున్నారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు సైఫ్ అలీఖాన్ నివాసంలో ఈ ఘటన జరిగింది. సైఫ్ కుటుంబ సభ్యులంతా గాఢ నిద్రలో ఉండగా.. ఇంట్లోకి చొరబడిన దుండగుడు చోరీకి యత్నించాడు. ఏదో అలికిడితో ఉలిక్కిపడి లేచి సైఫ్ అలీఖాన్ దుండగుడిని అడ్డుకునేందుకు యత్నించాడు. దీంతో అగంతకుడు కత్తితో సైఫ్ అలీఖాన్‌పై విచక్షణారహితంగా దాడి చేసి పారిపోయాడు. ఈ ఘటనలో ఆయనకు ఆరు చోట్ల కత్తి గాయాలైనట్లుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

దీంతో సైఫ్‌ను హుటాహుటిన ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సైఫ్ అలీఖాన్‌కు నిపుణుల పర్యవేక్షణలో చికిత్స జరుగుతోందని.. ఓ శస్త్ర చికిత్స కూడా చేస్తున్నట్లు సైఫ్ టీమ్ అధికారిక ప్రకటన చేసింది. ఈ ఘటనపై అభిమానులు, మీడియా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేసింది. సైఫ్‌పై దాడి విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఆయన ఇంటికి చేరుకున్నారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు సైఫ్‌పై దాడి చేసిన దుండగుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సైఫ్ అలీఖాన్ స్టార్ హీరో కాబట్టి ఆయన ఇంటికి 24 గంటలూ కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. అయితే ఇంటిపై బాగా అవగాహన ఉన్న ఆ కుటుంబానికి పరిచయస్తులైన వారే ఈ దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో సీసీటీవీ ఫుటేజ్ కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సైఫ్‌పై దాడి విషయం తెలుసుకున్న భారతీయ చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. ఆయన సన్నిహితులు, సినీ ప్రముఖులు, అభిమానులు షాక్‌కు గురయ్యారు. సైఫ్ అలీఖాన్ క్షేమంగా కోలుకుని ఇంటికి రావాలని ఆకాంక్షిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయం తెలిసి షాక్ అయ్యారు. సైఫ్ సార్‌పై దాడి విషయం తెలిసి తాను దిగ్భ్రాంతికి గురైయ్యానని.. ఆయన త్వరగా కోలుకుని, పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ఎన్టీఆర్ ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు.
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర పార్ట్ 1లో ఎన్టీఆర్ , సైఫ్ అలీఖాన్ కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బైరాగా క్రూరమైన విలన్‌గా కనిపించారు సైఫ్. అలాగే తెలుగువారిని తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ఆయనపై దాడి విషయం తెలుసుకున్న తెలుగు ప్రేక్షకులు కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు.


Click it and Unblock the Notifications











