Dhandoraa Teaser Review: దండోరా టీజర్ రివ్యూ.. చావు, పుట్టుక మధ్య భావోద్వేగాల నేపథ్యంగా
జాతీయ అవార్డు విజేత కలర్ ఫోటో, బ్లాక్‌బస్టర్ మూవీ బెదురులంక 2012 చిత్రాలను రూపొందించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని రూపొందిస్తున్న తాజా చిత్రం దండోరా. శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్నాడు. డిసెంబర్ 25 తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్న ఈ చిత్రం ప్రమోషన్స్ అంతే గ్రాండ్‌గా ప్రారంభించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ టీజర్ ఎలా ఉంది? ఈ సినిమా కథాంశం ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..
దండోరా అనగానే పల్లెల్లో వేసే చాటింపు అనేది గుర్తుకు వస్తుంది. ఈ సినిమా టైటిల్‌కు తగినట్టుగానే సామాజిక సృహను రగలించే కథతో తెరకెక్కుతున్నదనేది ఈ సినిమా టీజర్ స్పష్టం చేసింది. అగ్రవర్ణాలకు చెందిన అమ్మాయిని ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం, సంపన్న కుటుంబాలపై ఎదురు తిరిగితే జరిగే దౌర్జన్యాలను అంశాలను బ్యాక్ డ్రాప్‌గా చేసుకొని తెరకెక్కించిన చిత్రం దండోరా. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఆవిష్కరిస్తూనే ఫన్, సెటైర్, హార్ట్ టచింగ్ అంశాలతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచే ప్రయత్నం జరిగిందనే విషయం టీజర్ చెప్పకనే చెప్పింది.

దండోరా చిత్రంలో శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు నటించిన పాత్రలు వేటికి అవే తమ గుర్తింపును చాటుకొన్నాయి. బలమైన ఎమోషన్స్‌ను పండించబోతున్నాయనే విషయాన్ని స్పష్టం చేశాయి. గంభీరమైన పాత్రల్లో శివాజీ, నవదీప్, వేశ్య పాత్రల్లో బిగ్‌బాస్ ఫేమ్ బిందు మాధవి నటించారు. టీజర్‌లో ఆయ పాత్ర యాటిట్యూడ్, హావభావాలు ఆకట్టుకొనే ప్రయత్నం చేశాయి.
టీజర్‌లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా కనిపించిన విషయాల్లోకి వెళితే.. ఈ సినిమాలో డైలాగ్స్ తూటాల్లుగా మారుతున్నాయనేది చెప్పకనే చెప్పారు. మీరు తంతే లేవనోళ్లు.. అయినొచ్చి గొకితే లేస్తడా? ఎందివయా ఇది, ఎవరు చెప్పారు నేను తప్పు చేస్తున్నానని.. వాళ్లు డబ్బులిస్తున్నారు..నేను వాళ్లకి సర్వీస్ చేస్తున్నాను అంటూ శివాజీతో బిందు మాధవి చెప్పిన డైలాగ్ ఆలోచింపజేసేలా ఉన్నాయి. శవాన్ని మోసుకెళ్తున్న సీన్‌లో మా అవ్వను ఇంత దూరం ఎందుకు తీసుకెళుతున్నారెందుకు అని పిల్లాడు ప్రశ్నించడం ఈ సినిమాలో భావోద్వేగాలను తెలియజెప్పింది. నాలుగు పుస్తకాలు చదివి..లోకమంతా తెలిసినట్లు మాట్లాడొద్దు.. నీకు తెలియని లోకం ఇంకోటుందిరా', పుట్టుకు..చావు మధ్య మనిషి ఎదుర్కొనే సంఘర్షణ, పరిస్థితులు, భావోద్వేగాలు గురించి చెప్పే కథాంశంతో 'దండోరా' రూపొందుతోందని స్పష్టమవుతున్నది.
తెలంగాణ బ్యాక్ డ్రాప్‌గా కుల వివక్ష అనే కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు వెంకట్ ఆర్ శాఖమూరి, సృజన అడుసుమిల్లి ఎడిటింగ్, మార్క్ కే రాబిన్ మ్యూజిక్, క్రాంతి ప్రియం ఆర్ట్ విభాగం, రేఖా బొగ్గారపు క్యాస్టూమ్ డిపార్ట్‌మెంట్ పనులను నిర్వర్తిస్తున్నారు. ఎడ్వర్డ్ స్టెవెన్‌సన్ పెరెజి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, కొండారు వెంకటేష్ లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











