Dhurandhar 2:‘ధురంధర్ 2' బిగ్ షాక్.. హైకోర్టులో కొత్త వివాదం.. అసలేం జరిగింది?
Dhurandhar 2 Ban Controversy: బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) నటించిన ధురంధర్ 2 (Dhurandhar: The Revenge) సెన్సేషన్ మారింది. ఈ మూవీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుంటూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. విడుదలైన మొదటి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.761 కోట్ల వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో మంచి రెస్పాన్స్ అందుకుంటున్న ఈ సినిమా ఇప్పుడు తమిళనాడులో బ్యాన్ వివాదంతో వార్తల్లో నిలిచింది. ఇంతకీ ఏం జరిగింది?
రిలీజ్‌పై అభ్యంతరం
తమిళనాడులో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది. ఈ సమయంలో రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాలు విడుదల కావడం ఓటర్ల అభిప్రాయాలపై ప్రభావం చూపుతుందని ఒక న్యాయవాది మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సినిమాలో రాజకీయ అజెండా ఉందని, ఈ సినిమా పూర్తిగా ఒక రాజకీయ పార్టీకి మేలు చేసేలా ఉందని, దీని వల్ల ప్రజలపై ఈ సినిమా ప్రభావం పడుతుందని తెలిపారు.ఈ సినిమా ప్రదర్శన నిలిపివేయాలని కోరారు.

ఈ విషయంపై మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్. అర్వింద్ ధర్మాధికారి, జస్టిస్ జి. అరుల్ మురుగన్‌లతో కూడిన బెంచ్ స్పందించింది. ఇప్పటివరకు ఎలాంటి అధికారిక పిటిషన్ దాఖలు కాలేదని తెలిపింది. ముందుగా రిట్ పిటిషన్ దాఖలు చేసి, ఆ తరువాత అత్యవసర విచారణ కోరాలని సూచించింది. దీంతో ప్రస్తుతానికి సినిమా ప్రదర్శనపై ఎలాంటి ఆంక్షలు లేవు.అయితే భవిష్యత్తులో పిటిషన్ దాఖలైతే పరిస్థితి మారే అవకాశముంది.
పోలిటికల్ కంటెంట్... వివాదానికి కారణమా?
'ధురంధర్ 2' ఒక స్పై-పోలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ఇందులో రాజకీయ కుట్రలు, అధికార పోరాటాలు, ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ వంటి అంశాలు ప్రధానంగా ఉంటాయి. కథలో పాకిస్తాన్‌లోని లియారి ప్రాంతం బ్యాక్‌డ్రాప్‌గా ఉండగా, గ్యాంగ్ వార్స్, అంతర్జాతీయ కుట్రలు, ఉగ్రవాద సంఘటనల రిఫరెన్స్‌లు కూడా ఉన్నాయి. అలాగే సినిమాలో కనిపించే 'ఆతిఫ్ అహ్మద్' అనే పాత్ర, నిజ జీవిత రాజకీయ-గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ నుంచి ప్రేరణ పొందిందనే ఆరోపణలు రావడంతో వివాదం మరింత ముదిరింది. ఈ పాత్ర ద్వారా సున్నితమైన రాజకీయ, సామాజిక అంశాలను ప్రేరేపించే ప్రయత్నం చేశారని విమర్శలు వినిపిస్తున్నాయి.
హిట్ మధ్యే హీట్... సోషల్ మీడియాలో చర్చ
ఒకవైపు ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తూ రికార్డులు బద్దలు కొడుతుండగా, మరోవైపు రాజకీయ ఆరోపణలు, బ్యాన్ డిమాండ్లు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. కొందరు ఈ సినిమాను కేవలం వినోదంగా చూడాలని అంటుండగా, మరికొందరు ఇది రాజకీయంగా ప్రభావం చూపుతుందని అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం 'ధురంధర్ 2' థియేటర్లలో యథావిధిగా ప్రదర్శితమవుతోంది. కానీ కోర్టులో అధికారిక పిటిషన్ దాఖలైతే, సినిమా విడుదలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎన్నికల సమయంలో రాజకీయ అంశాలతో కూడిన సినిమాలపై పెరుగుతున్న పర్యవేక్షణ మధ్య, ఈ కేసు ఎలా మలుపు తిరుగుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద, బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న 'ధురంధర్ 2'కు కొత్త వివాదం హాట్ టాపిక్‌గా మారింది.
ఇదే సమయంలో తమిళ స్టార్ విజయ్ నటించిన జన నాయగన్ కూడా ఎన్నికల కోడ్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు సర్టిఫికేషన్‌ను నిలిపివేసి, విషయాన్నిఎన్నిక కమిషన్ కు రిఫర్ చేయడం గమనార్హం.


Click it and Unblock the Notifications




















