23 ఏళ్లుగా ఇండస్ట్రీలోనే.. అల్లు అర్జున్ అలా, నువ్వేమో: నితిన్ కెరీర్‌పై దిల్‌రాజు కుండబద్ధలు
చిత్ర పరిశ్రమలో విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. తమకంటే వెనుక కెరీర్ ప్రారంభించిన వారు స్టార్లుగా, సూపర్ స్టార్లుగా వెలుగొందుతుంటే తమ జీవితం మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంటుంది. ఇక ఒకేసారి కెరీర్ స్టార్ట్ చేసిన ఇద్దరు వ్యక్తుల జీవితాలు కూడా ఇలాగే ఉన్న ఉదంతాలెన్నో . ఇలాంటి సెకండ్ కేటగిరీలోకి వస్తారు హీరో నితిన్. ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు 23 ఏళ్లు గడుస్తున్నా నేటికీ స్టార్‌డమ్ సంపాదించలేకపోయారు. సినిమాలు చేస్తున్నప్పటికీ ఫలితం మాత్రం దక్కలేదు.
జయంతో హీరోగా ఎంట్రీ
ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రేష్ట్ మూవీస్ అధినేత సుధాకర్ రెడ్డి కుమారుడే నితిన్. ఇంట్లో సినిమా వాతావరణం ఉండటంతో నితిన్ హీరోగా లాంచ్ కావడం సులభంగా జరిగిపోయింది. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన జయం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు నితిన్. తొలి మూవీతోనే ఫిలింఫేర్ సౌత్ అవార్డ్ సొంతం చేసుకున్నారు. జయం బ్లాక్‌బస్టర్ తర్వాత నితిన్‌కు వరుసపెట్టి అవకాశాలు వచ్చాయి. వీవీ వినాయక్ దర్శకత్వంలో దిల్, ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన సై సినిమాలు ఘన విజయం సాధించడంతో నితిన్ స్టార్ రేస్‌లోకి దూసుకొచ్చారు. కానీ ఆ తర్వాత అల్లరి బుల్లోడు, ధైర్యం, రామ్, టక్కరి, ఆటాడిస్తా, విక్టరీ, ద్రోణ, హీరో, రెచ్చిపో, అడవి, మారో, సీతారాముల కళ్యాణం లంకలో వంటి వరుస ఫ్లాప్స్‌తో నితిన్ వెనకబడిపోయాడు.

ఒక్క హిట్.. 10 ఫ్లాపులు
కెరీర్‌లో నిలబడాలంటే ఖచ్చితంగా హిట్ కొట్టాలనే కసితో విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఇష్క్‌తో మళ్లీ నితిన్ హీరోగా నిలబడ్డాడు. ఆ వెంటనే గుండెజారి గల్లంతయ్యిందే, హార్ట్ ఎటాక్, అ ఆ, భీష్మ వంటి బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. కానీ బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాప్స్ పలకరించడంతో నితిన్ కెరీర్ గాడి తప్పింది. ప్రస్తుతం వెంకీ కుడుమల దర్శకత్వంలో రాబిన్ హుడ్, వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో తమ్ముడు చేస్తున్నాడు నితిన్. ఈసారి ఎట్టిపరిస్ధితుల్లోనూ సాలీడ్ గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నితిన్ సరసన సప్తమి గౌడ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ లయ కీలకపాత్ర పోషిస్తున్నారు. జూలై 4న తమ్ముడు ప్రేక్షకుల ముందుకు రానుంది.
తమ్ముడితో పలకరించనున్న నితిన్
రిలీజ్ డేట్ దగ్గర పడటంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. దీనిలో భాగంగా నితిన్‌తో ఫన్నీ ఇంటర్వ్యూ నిర్వహించారు నిర్మాత దిల్‌రాజు. ఈ సందర్భంగా నితిన్ కెరీర్ ఇలా కావడంపై దిల్‌రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. దిల్‌కి తమ్ముడికి మధ్యలో నాలో చూసిన మార్పు, ప్లస్సులు, మైనస్‌లు ఏంటని దిల్‌రాజుని అడుగుతాడు నితిన్. '23 ఏళ్లుగా నువ్వు యాక్టర్‌గా జర్నీ చేశావ్ నాకంటే కూడా సీనియర్‌వి. నేను 2003లో ప్రొడ్యూసర్‌ని అయ్యా.. నువ్వు 2002లో హీరోవి అయ్యావ్ అంటే నాకంటే వన్ ఇయర్ సీనియర్‌వి. నీకు ఎక్స్‌పీరియన్స్ వచ్చింది.. నేను ఎలా అయితే హ్యాండిల్ చేస్తున్నానో, నీక్కూడా ఆ కెపాసిటీ వచ్చింది' అని దిల్‌రాజు తెలిపారు.
నితిన్ కెరీర్‌పై దిల్‌రాజు వ్యాఖ్యలు
'23 సంవత్సరాలలో నీకంటే జూనియర్‌నైన నేను సాధించుకుంటూ టాప్‌లోకి వచ్చా.. నితిన్‌ను నేను అలా ఊహించాను. దిల్ సినిమా చేస్తున్నప్పుడు నిన్ను, ఆర్య సినిమా చేస్తున్నప్పుడు బన్నీని చూసి వీళ్లు ఫ్యూచర్ స్టార్స్ అని ఊహించా. కానీ నువ్వు ఆ మార్క్ అందుకోలేకపోయావ్.. నువ్వు కోల్పోయింది అదేనని నా ఫీలింగ్ అని దిల్‌రాజు కుండబద్ధలు కొట్టారు. తమ్ముడితో సక్సెస్‌ఫుల్ హీరోగా వస్తావ్.. కానీ ఇది సరిపోదని, ఎల్లమ్మతో హిట్ కొట్టాలని దిల్‌రాజు సూచించారు. దిల్ పార్ట్ 2 తీసే ప్లాన్ ఉందా? అని నితిన్ ప్రశ్నించగా.. అప్పుడు ఫాదర్ క్యారెక్టర్, కొడుకు క్యారెక్టర్ కూడా నువ్వే వేయాలని దిల్‌రాజు అనడంతో సరదాగా నవ్వేస్తారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











