నిర్మాతకు విలువ లేదు.. మా దగ్గర తీసుకుంటూ మమ్మల్నే అలా.. దిల్‌రాజు హాట్ కామెంట్స్
డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ ప్రారంభించి.. నిర్మాతగా మారి ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు భారతీయ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు దిల్‌రాజు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై 60కి పైగా సినిమాలు చేయడంతో పాటు ఎందరో హీరోలను, హీరోయిన్లను, దర్శకులను, ఇతర టెక్నీషియన్లను వెండితెరకు పరిచయం చేశారు రాజుగారు. దిల్‌రాజు బ్యానర్ నుంచి సినిమా వస్తుందంటే ఖచ్చితంగా దానిలో విశేషం ఉంటుందని ప్రేక్షకులు నమ్ముతారంటే చిత్ర పరిశ్రమపై ఆయన ఎలాంటి ముద్రవేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇండస్ట్రీని శాసించే స్థాయిలో దిల్‌రాజు
దిల్‌రాజు ఓ ప్రాజెక్ట్ డీల్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఎన్నో లెక్కలు వేసుకుంటారని, ఆయన జడ్జ్‌మెంట్ తప్పదని ఇండస్ట్రీ జనాల నమ్మకం. సాధారణ కుటుంబం నుంచి వచ్చి తెలుగు చిత్ర పరిశ్రమను శాసించే నలుగురిలో ఒకరిగా దిల్‌రాజు ఎదిగారు. ఈ జనరేషన్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా ఘనత సాధించిన రాజుగారు.. గత కొంతకాలంగా ఇండస్ట్రీలో తీరుతెన్నులు... పెరిగిన ప్రొడక్షన్ ఖర్చులు తదితర అంశాలపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా చిత్ర పరిశ్రమలో నిర్మాతల పరిస్థితిపై ఆయన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..

దిల్ మూవీ రైట్స్ ఫ్రీగా ఇచ్చేస్తానని చెప్పా
అలనాటి నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు 90వ పుట్టినరోజు వేడుకలు ఫిబ్రవరి 18వ తేదీన హైదరాబాద్‌లో జరిగాయి. ఈ కార్యక్రమానికి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, చిన్నజీయర్ స్వామితో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. పూర్ణ చంద్రరావు గారి కోసం అమెరికా నుంచి కూడా వచ్చారు. పూర్ణచంద్రరావు గారితో నాకు ఎలాంటి కనెక్షన్ లేదు. నేను చిత్ర పరిశ్రమకు వచ్చే సమయానికే వారు ఆల్‌మోస్ట్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. నేనొచ్చిన తర్వాత వారు కొన్ని సినిమాలు నిర్మించడం జరిగింది. దిల్ సినిమా నేను తీసినప్పుడు.. దానిని నేను హిందీలో రీమేక్ చేస్తానని రైట్స్ కావాలని అడిగితే.. వారు తీస్తానంటే ఫ్రీగా ఇస్తానని చెప్పానని దిల్‌రాజు గుర్తుచేసుకున్నారు.
వాళ్లే ఇండస్ట్రీని శాసిస్తున్నారు
నిర్మాత అంటే ఈ రోజు విలువ లేదు. కానీ ఆ రోజుల్లో అట్లూరి పూర్ణచంద్రరావు గారి లాంటి నిర్మాతలు ఎలా ఉండేవారో రజనీకాంత్ గారు చెప్పారు. నిర్మాత అంటే ఇచ్చేవాడు.. అందరూ తీసుకునేవాళ్లు. తీసుకునేవాళ్లే ఈరోజు ఇచ్చేవాడిని శాసించే లెవల్‌లో ఈరోజు సినిమా ఇండస్ట్రీ వుంది. పూర్ణచంద్రరావు గారు డిసెంబర్‌లో ఫోన్ చేసి ఫిబ్రవరిలో ఓ కార్యక్రమానికి రావాల్సి ఉంటుందని డేట్స్ సిద్ధంగా ఉంచుకోమని చెప్పడంతో వెంటనే ఓకే చెప్పేశారు. దాంతో మూడు రోజుల క్రితం బెనర్జీగారిని అడిగి అసలు విషయం కనుక్కున్నానని దిల్‌రాజు తెలిపారు.
మాకు హీరోలు కావాల్సిందే
శతమానం భవతి సినిమా టైంలో వెంకయ్య నాయుడుగారి చేతుల మీదుగా నేషనల్ అవార్డ్ తీసుకుని నెక్ట్స్ డే మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్‌కి వెళ్లాను. అప్పుడు వారు చెప్పిన మాటలు అలా గుర్తుండిపోయాయి. అప్పుడు మనది ఒకటే రాష్ట్రం.. మన రాష్ట్రం నుంచి సౌతిండియా నుంచి మనకు విలువ ఉందంటే వెంకయ్య నాయుడుగారి లాంటి లీడర్ల వల్లే. 23 ఏళ్లలో 60 సినిమాలు తీశాను. కానీ మేం సినిమాలు తీయాలంటే హీరోలు కావాలి. కానీ హీరోలంతా హీరోలలాగే ఉంటారు.. కానీ ఒక్క రజనీకాంత్ గారు మాత్రం మనిషిలాగే ఉంటారు.
ఒక నిర్మాతకు ఉండాల్సిన క్వాలిటీస్ పూర్ణచంద్రరావు గారిలో ఉన్నాయి. రామానాయుడు గారు, పూర్ణచంద్రరావు గారు, కేఎస్ రామారావు గారు వంటి నిర్మాతలు వేసిన బాటలోనే మేమంతా నడుస్తున్నాం. పూర్ణచంద్రరావు గారు 87 సినిమాలు ఎలా తీశారో చెప్పారు. ఇలాంటి ఈవెంట్‌కు మమ్మల్ని ఆహ్వానించి మా అందరినీ కలిపారు. ఇక్కడున్న ఎవరికీ 90వ పుట్టినరోజు జరుపుకోవడం సాధ్యం అవుతుందో లేదో తెలియదు.. అది పూర్ణచంద్రరావు గారికే సాధ్యం. శతజయంతి వేడుకల్లోనూ మనందరం ఇలాగే కలుసుకోవాలని దిల్‌రాజు ఆకాంక్షించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతున్నాయి.


Click it and Unblock the Notifications











