దిల్ రాజు కొడుకు కాబట్టి అలా చేశారని అన్నారు.. రౌడీ బాయ్స్ విషయంలో జరిగింది ఇదే: దిల్ రాజు
యంగ్ హీరో ఆశిష్. లవ్ టుడే ఫేమ్ ఇవానా జంటగా వస్తున్న చిత్రం సెల్ఫిష్. ఇంతకుముందు రౌడీ బాయ్స్ చిత్రం చేసిన ఆశిష్ కు ఇది రెండో సినిమా. యూత్ ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న సెల్ఫిష్ సినిమాకు కొత్త డైరెక్టర్ కాశీ విశాల్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సాంగ్ ను రీసెంట్ గా విడుదల చేశారు.
హీరో ఆశిష్ పుట్టినరోజు సందర్భంగా సెల్ఫీష్ మూవీ నుండి దిల్ కుష్ అనే పాట ప్రోమోను విడుదల చేసింది చిత్ర యూనిట్. తొలి సింగిల్ ను మధ్యాహ్నం 3.33 నిమిషాలకు విడుదల చేశారు. ఈ దిల్ కుష్ పాటను జావెద్ అలీ పాడారు. ఈ సాంగ్ కు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాయగా.. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. ఈ కార్యక్రమానికి నిర్మాత దిల్ రాజు హాజరయ్యారు.

ఈ క్రమంలో దిల్ రాజు మాట్లాడుతూ.. అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సినిమాలోని పాట కోసం చాలా కష్ట పడ్డామని చెప్పుకొచ్చారు. ఏడాది కింద ఇచ్చిన ట్యూన్ నచ్చి దాని కోసం చాలా మార్పులు, చేర్పులు చేయిస్తూ మరీ పాటను రాయించుకున్నట్లు తెలిపారు. అమెరికాలో ఉన్నప్పటికీ మిక్కీ జే మేయర్.. ఎన్ని మార్పులు చెప్పినా తెల్లారేసరికి చేసిచ్చారని వివరించారు.
గతంలో రౌడీ బాయ్స్ చిత్రం చాలా బాగా ఆడిందని... హిట్టుగా నిలిచిందని చెప్పారు. కాకపోతే కొంతమంది దిల్ రాజు కొడుకు కాబట్టి కావాలని ప్రమోషన్లు చేయించుకొని సినిమా ఆడేలా చేశారని అన్నారని వివరించారు. కానీ తాము అలా చేయలేదని.. థియేట్రికల్ గా వసూళ్లు సాధించినప్పుడే సినిమా హిట్టుగా నిలుస్తుందని చెప్పారు. ఓ కొత్త హీరోకు ఏ రేంజ్ లో రావాలో అంత వసూళ్లు ఆశిష్ మొదటి సినిమాకు వచ్చాయని అని అన్నారు.

అంతేకాకుండా ఆశిష్ ను ప్రేక్షకులంతా దగ్గరకు తీసుకున్నారని.. సినిమా చూస్తే కొత్త హీరోలాగా కనిపించలేదని చెప్పినట్లు గుర్తు చేశారు. అదొక్కటి చాలు ఆశిష్ హీరోగా నిలవడానికి అంటూ దిల్ రాజు స్పష్టం చేశారు. ముందు ముందు కూడా మంచి మంచి సినిమాలతో వస్తాడని.. ముఖ్యంగా సెల్ఫిష్ చాలా బాగుందని అన్నారు. రెక్‌లెస్ ఆటిట్యూడ్ తో, పక్కా మాస్ గా ఉండే హీరో చుట్టూ జరిగే కథగా ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్లను చూస్తే తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











