ఒకవైపు ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్.. మరోవైపు పవన్ కల్యాణ్ తొలి ప్రేమ.. అదో చరిత్ర.. దిల్ రాజు ఎమోషనల్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, అందాల భామ కీర్తీ రెడ్డి జంటగా కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందిన తొలి ప్రేమ చిత్రం తెలుగు సినీ పరిశ్రమలో క్లాసిక్ హిట్‌గా నిలిచింది. 1998 సంవత్సరం జూలైలో విడుదలైన ఈ చిత్రం 25 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తొలి ప్రేమ సినిమాను శ్రీ మాతా క్రియేషన్స్ నిర్మాతలు రఘురాం రెడ్డి, రవికాంత్ రెడ్డి
రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో ఆ సినిమాను తన జీవితంలో తొలిసారి డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు మాట్లాడుతూ..
తెలుగు సినీ పరిశ్రమలో క్లాసిక్ హిట్ గా నిలిచిన ప్రేమ కథా చిత్రాల్లో 'తొలిప్రేమ' ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కీర్తి రెడ్డి జంటగా నటించిన ఈ చిత్రానికి ఎ.కరుణాకరన్ దర్శకత్వం వహించారు. ఎస్.ఎస్.సి. ఆర్ట్స్ పతాకంపై జి.వి.జి.రాజు నిర్మించిన ఈ చిత్రం 1998 జూలైలో విడుదలై ఘన విజయం సాధించింది. ఓ మధ్య తరగతి యువకుడి తొలిప్రేమ కథగా తెరకెక్కిన ఈ చిత్రం యువతను కట్టిపడేసింది. ప్రేమ సన్నివేశాలు, హాస్య సన్నివేశాలు, దేవా స్వరపరిచిన పాటలు ఈ సినిమాని మళ్ళీ మళ్ళీ చూసేలా చేశాయి. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపించే అతికొద్ది సినిమాల్లో ఒకటిగా 'తొలిప్రేమ' ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకుంది. ఇప్పుడు ఈ సినిమాని మళ్ళీ వెండితెర మీద చూసే అద్భుతమైన అవకాశం లభిస్తోంది.

తొలి ప్రేమ సినిమా నాకు గొప్ప అనుభూతిని ఇచ్చిన సినిమా. దర్శకుడు కరుణాకరన్, నిర్మాత జీవీజీ రాజు, పవన్ కల్యాణ్‌కు అందరికి కొత్త సినిమా. నా జీవిత చరిత్ర రాస్తే.. అందులో తొలి ప్రేమకు ఒక పేజ్ తప్పకుండా ఉంటుంది. నేను అప్పుడప్పుడే డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెడుతున్నాను. ఆ సమయంలో రవీందర్ రెడ్డి అనే ఫైనాన్షియర్ నాకు ఫోన్ చేసి.. కొత్త డైరెక్టర్, పవన్ కల్యాణ్ అనే కొత్త హీరోకు కథ చెప్పాడట. ఆ సినిమాకు ఒక నిర్మాతను అనుకొని.. ఆ తర్వాత జీవీవీ రాజును సినిమా తీయమని చెప్పారట అనే విషయాన్ని చెప్పాడు. దాంతో నేను ఏదో ఊహించుకొని ట్రైన్ ఎక్కి చెన్నైకి వెళ్లి.. పూజా కార్యక్రమంలో రాజు గారిని కలిశాను అని దిల్ రాజు తెలిపారు.

తొలిప్రేమ పూజా కార్యక్రమంలో జీవీజి రాజును కలిసి.. నా గురించి చెప్పుకొన్నాను. అప్పటికి నేను పెళ్లి పందిరి సినిమా మాత్రమే చేశాను. నా గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. అయితే డిస్ట్రిబ్యూషన్ గురించి అడిగితే.. హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత మాట్లాడుతాను అని చెప్పారు. హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత ఆయన వెంటపడ్డాను. ఆయన డిస్ట్రిబ్యూషన్ చేస్తావా? అంటే అవును అని చెప్పాను. అలా ఒక మాటతో నాకు డిస్ట్రిబ్యూషన్ ఇచ్చారు అని దిల్ రాజు ఆ రోజు సంఘటనను గుర్తు చేసుకొన్నారు.
నిర్మాత జీవీజీ రాజు షేక్ హ్యాండ్ ఇవ్వడంతో తొలి ప్రేమ జర్నీ మొదలైంది. నా జీవితంలో నేను ఎంత ఎంజాయ్ చేశానో నాకే తెలియదు. నేను నిర్మాతగా తీసిన సినిమా కంటే తొలి ప్రేమ సినిమానే ఎంజాయ్ చేశాను. ఐదు రోజుల ముందు రామానాయుడు స్టూడియోలో ప్రివ్యూ వేస్తే చూశాను. తాజ్ మహల్ సాంగ్ చూసి.. ఎమోషనల్ సాంగ్ ప్రీ క్లైమాక్స్‌లో ఉంటే బాగుండని అనుకొన్నాను. నా తరహాలో నేను ఫీడ్ బ్యాక్ ఇచ్చాను అని దిల్ రాజు నవ్వుల్లో మునిగిపోయారు.
ఇక తొలి ప్రేమ 100 శతదినోత్సవం నాకు గొప్ప అనుభూతి. ఆ రోజు ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతున్నది. మరో వైపు సంధ్య థియేటర్ 35లో సూర్యుడు సినిమా, సంధ్య 70ఎంఎంలో తొలి ప్రేమ నడుస్తున్నది. అయితే ఊహించని జనం రావడంతో సూర్యుడు సినిమాను క్యాన్సిల్ చేయించి తొలిప్రేమ సినిమాను వేయించాం. అది ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఇంత క్రేజ్ రావడం నాకు ఇప్పటికీ గొప్ప అనుభూతి మిగిల్చింది. అది ఒక చరిత్ర అని దిల్ రాజు చెప్పారు.
తొలి ప్రేమ అలాంటి ఎన్నో అనుభూతులు మిగిల్చింది. డిస్ట్రిబ్యూషన్‌తోపాటు మాకు ఐదు సంవత్సరాలు రైట్స్ ఇచ్చే వాళ్లు. అయితే నాకు డబ్బులు ఎప్పుడు అవసరమైతే అప్పుడు తొలి ప్రేమ వేసేవాడిని. నాకు ఫ్లాప్ వస్తే తొలి ప్రేమ వేసి డబ్బులు సంపాదించే వాడిని. అలాంటి తొలిప్రేమ సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. జూన్ 30వ తేదీన తొలి ప్రేమ రి రిలీజ్ అవుతున్నది. థియేటర్‌లో మరోసారి కుమ్మేద్దాం. నిర్మాతలు రఘురాం రెడ్డి, రవికాంత్ రెడ్డికి ఆల్ ది బెస్ట్ అని దిల్ రాజు అన్నారు.


Click it and Unblock the Notifications











