'మెగా ఫ్యామిలీలో గొడవలు ఇప్పటివి కాదు.. ఇక అల్లు అర్జున్‌ను వదిలి పెట్టరు'
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ కారణంగా మెగా ఫ్యామిలీలో విభేదాలు ముదిరి పాకానపడ్డాయన్న సంగతి తెలిసిందే. నాగబాబు ''పరాయివాడు '' ట్వీట్ వేసిన నాడే మెగా కుటుంబం అతని విషయంలో ఎలా ఉండబోతుందనే సంకేతాలు బలంగా వెళ్లాయి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లు అర్జున్‌కు సరైన ట్రీట్‌మెంట్ ఇవ్వకతప్పని స్థితిని ఆయనే కల్పించుకున్నారనే వాదనలు నడుస్తున్నాయి. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ .. తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో అల్లు అర్జున్, స్నేహారెడ్డిలను అన్‌ఫాలో కావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. కానీ ఒకప్పుడు అల్లు అర్జున్‌ని మెగా ఫ్యామిలీ నుంచి వేరుగా చూడొద్దని వేదిక ద్వారా అభిమానులకు పిలుపునిచ్చిన సాయితేజే ఇలా చేశారంటే మెగా కుటుంబాన్ని అల్లు అర్జున్ ఎంతగా డిస్ట్రబ్ చేశాడోనని అభిమానులు ఫైర్ అవుతున్నారు.
మెగా ఫ్యామిలీలో పరిణామాలపై ప్రముఖ దర్శకుడు గీతాకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి, అల్లు అరవింద్‌లు దిగువ స్థాయి నుంచి పైకొచ్చారని.. ప్రతి మనిషిలోనూ కానీ పిల్లలు పెద్దయ్యాకే ఇగోలు, స్వార్థం ఏర్పడతాయన్నారు. మెగా హీరోలను చూసి చిరంజీవి ఒకప్పుడు ఫీల్ అయ్యేవారని.. ఎందుకంటే తన పేరు చెప్పుకుని అందరూ హిట్లు కొడతున్నారు, నా కొడుకు పరిస్థితి ఏంటని బాధపడ్డారని గీతాకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

రామ్ చరణ్‌కి రెండు మూడు ఫ్లాప్స్ వచ్చి ఇంకా బ్రేక్ రాలేదని .. మిగిలిన హీరోలు మాత్రం మంచి హిట్లు కొడుతున్నారని చిరంజీవి భావించేవారని గీతాకృష్ణ పేర్కొన్నారు. మెగా హీరోలంతా చిరంజీవి పాటలను వాడుకునేవారని, దాంతో ఆయన సీరియస్ అయ్యారని పేర్కొన్నారు. ఇదే సమయంలో అల్లు అరవింద్, అల్లు అర్జున్‌లు స్పీడుగా దూసుకొచ్చేశారని .. అలాగని మెగాస్టార్ కుమారుడికి అన్యాయం చేయాలనే మనస్తత్వం అల్లు అరవింద్‌కు లేదని గీతాకృష్ణ తెలిపారు.
కాకపోతే .. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడం మాత్రం నిజమన్నారు. దీనికి సోషల్ మీడియా తోడై , రెండు కుటుంబాలను విడగొట్టేవరకు నిద్రపోయేలా లేదంటూ గీతాకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా అల్లు అరవింద్‌ను ఇష్టపడరన్నారు. చిరంజీవిని గౌరవించే అరవింద్.. ఆయన తమ్ముడైన పవన్‌ను మాత్రం వెంట్రుక ముక్కలా చూసేవారని గీతాకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. 100కి 300 శాతం అల్లు అరవింద్ పక్కా కమర్షియల్ అని , మార్కెట్ ఉంటేనే మాట్లాడతారని ఆయన వ్యాఖ్యానించారు.

ఇరువర్గాలపై చెప్పుడు మాటల ప్రభావం గట్టిగా పడిందని దాని ప్రభావం కనిపిస్తోందన్నారు. అల్లు అర్జున్‌కి పబ్లిసిటీ పిచ్చని.. అందుకే పీఆర్ విభాగానికి విపరీతంగా డబ్బులు కేటాయిస్తాడని గీతాకృష్ణ అన్నారు. అది చూసుకునే తనకు ఆర్మీ ఉందని బన్నీ ఫీలవుతూ ఉంటాడంటూ సెటైర్లు వేశారు. బజ్ రావాలని తాపత్రయపడే క్రమంలోనే నంద్యాల వెళ్లి ఉంటాడని గీతాకృష్ణ అభిప్రాయపడ్డారు. ప్రచారానికి వెళ్లి అల్లు అర్జున్ బ్యాడ్ అయిపోయాడని.. దీనిని సోషల్ మీడియా ఇంకాస్త గట్టిగా ప్రచారం చేసిందని ఆయన అన్నారు.
అల్లు అర్జున్‌ని పవన్ కళ్యాణ్ పెద్దగా పట్టించుకోరని , కాకపోతే మొన్నటి ఎన్నికలు చావోరేవో వంటిదని అందుకే బన్నీని సీరియస్‌గా తీసుకున్నారని గీతాకృష్ణ చెప్పారు. ఆయన వ్యాఖ్యలను బట్టి మెగా - అల్లు కుటుంబాల మధ్య మనస్పర్ధలు ఈనాటీవి కాదని, కాలక్రమంలో కొన్ని ఘటనలు దీనికి బీజాలు వేశాయన్నది అర్థమవుతోంది. కాకపోతే వాటిని చూసీచూడనట్లుగా వదిలేసిన మెగా కుటుంబం ఈసారి మాత్రం కన్నెర్ర చేశారని ఫిలింనగర్ టాక్.


Click it and Unblock the Notifications











