చోటా కె నాయుడు వర్సెస్ హరీష్ శంకర్.. 10 ఏళ్ల నాటి సినిమాపై గొడవ.. డైరెక్టర్ మాస్ వార్నింగ్!
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్న హరీష్ శంకర్ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన టాలెంట్ కల్గిన ఈయన అదిరిపోయే సినిమాలతో వస్తూ అందరినీ అలరిస్తుంటారు. అయితే ఇప్పటి వరకు ఈయన ఇండస్ట్రీలో అందరితోనూ బాగానే ఉన్నారు. లేకపోయినా ఆ విషయాన్ని ఎప్పుడూ బయట ప్రస్తావించలేదు. కానీ తాజాగా కెమెరా మాన్ చోటా కే నాయుడుపై ఫైర్ అయ్యారు. ఎక్స్ వేదికగా ఓ పెద్ద లేఖను కూడా రాసుకొచ్చారు. అసలేం జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కెమెరామేన్ చోటా కె నాయుడు... రామయ్యా వస్తావయ్యా సినిమా గురించి మాట్లాడారు. ముఖ్యంగా సినిమా తీసేటప్పుడు తాను డైరెక్టర్ హరీష్ శంకర్ కు కొన్ని సూచనలు చేశానని.. కానీ అతడు అస్సలే పట్టించుకోకుండా తనకు నచ్చినట్లు చేశాడని అన్నాడు. అయితే ఓసారి చెబితే వినే వాళ్లకు మళ్లీ చెబుతామని కానీ వినని వారికి ఓసారి చెప్పి వదిలేస్తామని తెలిపారు. అయితే ఈ ఇంటర్వ్యూ చూసిన హరీష్ శంకర్ తాజాగా దీనిపై స్పందించారు. ఎక్స్ వేదికగా తన మనసులోని మాటలను లేఖ రూపంలో వివరించారు.

లేఖ మొదలు పెట్టడమే.. వయసులో పెద్ద కాబట్టి అంటూ నమస్కారం చెప్పారు. ఆ తర్వాత రామయ్య వస్తావయ్య సినిమా వచ్చి దాదాపు దశాబ్దం దాటిందని.. ఈ పదేళ్లలో చోటా కే నాయుడు 10 ఇంటర్వ్యూలు ఇస్తే.. తాను ఒక 100 ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటానని అన్నారు. కానీ తానెఎప్పుడూ ఎక్కడా కూడా అతడి గురించి తప్పుగా మాట్లాడలేదని చెప్పుకొచ్చారు. కానీ ఆయన మాత్రం తన గురించి పలుమార్లు అవమానంగా మాట్లాడుతున్నట్లు తెలిపారు.
"మీకు గుర్తుందో లేదో ఓ సందర్భంలో మిమ్మల్ని తీసేసి.. వేరే కెమెరామెన్తో షూటింగ్ చేద్దాం అన్న ప్రస్తావన వచ్చింది. కానీ రాజుగారు చెప్పడం మూలంగానో గబ్బర్ సింగ్ వచ్చాక పొగరుతో పెద్ద కెమెరామెన్ ని తీసేస్తున్నాడు... అని పదిమంది పలు రకాలుగా మాట్లాడుకుంటారని మథనపడుతూనే మీతో సినిమా పూర్తి చేశా. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకున్నా ఏ రోజు ఆ నింద మీ మీద మోపలేదు ఎందుకంటే "గబ్బర్ సింగ్" వచ్చినప్పుడు నాది "రామయ్య వస్తావయ్య" వస్తే అది నీది అనే క్యారెక్టర్ కాదు నాది." అని చెప్పుకొచ్చారు.

అయితే "మీరు మాత్రం ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడగకపోయినా, నా ప్రస్తావన రాకున్నా, నాకు సంబంధం లేకున్నా, నా గురించి అవమానకరంగా మాట్లాడుతున్నారు. ఇలా చాలాసార్లు జరిగినా, నేను మౌనంగానే బాధపడ్డా, కానీ నా స్నేహితులు అవ్వచ్చు లేదా నన్ను అభిమానించే వాళ్ళు అవ్వచ్చు నా ఆత్మ అభిమానాన్ని ప్రశ్నిస్తుండడంతో ఈ మాత్రం రాయాల్సి వస్తుంది. మీతో పని చేసిన అనుభవం నన్ను బాధపెట్టినా, మీకున్న అనుభవంతో నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను అందుకే మీరంటే ఇంకా నాకు గౌరవం ఉంది దయచేసి ఈ గౌరవాన్ని కాపాడుకోండి." అని వివరించారు.
ఇలాగే ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయమని.. లేదు నేను మళ్లీ కెలక్కుంటానని అంటే ఎనీ డే ఎనీ ప్లాట్ ఫామ్.. ఐయామ్ వెయిటింగ్ అంటూ రాసుకొచ్చారు. ఇలా మాస్ వార్నింగ్ ఇచ్చిన హరీష్ శంకర్ ట్వీట్ కు పెద్ద ఎత్తున కామెంట్లు వస్తున్నాయి. ఇలాంటి వాళ్లకు రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్లే కరెక్టు అని కొందరు.. మంచి పని చేశారని మరికొందరు వివరిస్తున్నారు. మరి వీటిపై చోటా కె నాయుడు ఎలా స్పందిస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











