మొదట బాలీవుడ్.. ఆ తర్వాత బన్నీ!
టాలీవుడ్ లో ప్రతిభావంతులైన దర్శకులలో జాగర్లమూడి క్రిష్ ఒకరు. క్రిష్ చిత్రాలు వైవిధ్యంగా, సందేశాత్మకంగా సాగుతాయి. క్రిష్ కు ప్రస్తుతం బ్యాడ్ టైం కొనసాగుతోంది. అటు నిర్మాతగా, దర్శకుడిగా క్రిష్ రూపొందించిన చిత్రాలు నిరాశపరిచాయి. అంతరిక్షం చిత్రానికి క్రిష్ నిర్మాతగా వ్యవహరించాడు. ఆ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇక దర్శకుడిగా తెరకెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం భారీ అంచనాలతో విడుదలైన దారుణమైన పరాజయానికి గురైంది. ఎన్టీఆర్ బయోపిక్ తో క్రిష్ విమర్శలకు గురయ్యారు.
ఇక కంగనా రనౌత్ నటించిన మణికర్ణిక చిత్రం కూడా క్రిష్ దర్శకత్వంలోనే తెరకెక్కింది. షూటింగ్ చివరిదశలో కంగనాతో విభేదాల కారణంగా క్రిష్ ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడు. ఈ చిత్రం విడుదలయ్యాక దర్శకత్వం విషయంలో కంగనా, క్రిష్ మధ్య విభేదాలు తలెత్తాయి. ప్రస్తుతం క్రిష్ ఈ విషయాలన్నింటి మరచిపోయి కొత్త చిత్రంపై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది.

బాలీవుడ్ లో ఓ చిత్రం తెరకెక్కించేందుకు క్రిష్ ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అన్ని వివరాలు త్వరలో తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రం తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో క్రిష్ ఓ చిత్రానికి ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి. గతంలో అల్లు అర్జున్ క్రిష్ దర్శకత్వంలో వేదం చిత్రంలో నటించాడు.


Click it and Unblock the Notifications











