ప్రభాస్‌ను అలా చంపేయడం తప్పే.. లెంపలేసుకొన్న స్టార్ దర్శకుడు
ఆర్జీవీ స్కూల్ నుంచి వచ్చిన విలక్షణ దర్శకుల్లో కృష్ణవంశీ ఒకరు. గులాబీ చిత్రం ద్వారా దర్శకుడిగా మారిన ఆయన నిన్నే పెళ్లాడతా, సింధూరం, అంత:పురం, సముద్రం, మురారి, ఖడ్గం, శ్రీ ఆంజనేయం, చక్రం, డేంజర్, రాఖీ, చందమామ, మహాత్మ, గోవిందుడు అందరివాడే వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. కొత్త దర్శకుల రాక, మధ్యలో కొన్ని ఫ్లాప్స్ ఎదురుకావడంతో కృష్ణవంశీ స్లో అయ్యారు. అయితే గతేడాది రంగమార్తాండతో వచ్చి తనలో వాడి వేడి ఏమాత్రం తగ్గలేదని ఆయన నిరూపించుకున్నారు.
దేశభక్తి, సామాజిక సంబంధాలు, సంస్కృతి, కుటుంబం కృష్ణవంశీ సినిమాల్లో కనిపిస్తుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్లను అందంగా చూపించే డైరెక్టర్లలో దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు తర్వాతి స్థానం కృష్ణవంశీదే. ముఖ్యంగా రొమాంటిక్ సాంగ్స్ తీయడంలో ఆయనకు ఆయనే సాటి. కృష్ణవంవీ చిత్రాల్లో నటించిన సంఘవి, మహేశ్వరి, సోనాలి బింద్రే, రమ్యకృష్ణ, సౌందర్య, ఛార్మి, కాజల్ అగర్వాల్, జెనీలియా, భావన, అనుష్క శెట్టి తర్వాతి రోజుల్లో స్టార్ హీరోయిన్లుగా వెలుగొందారు.

సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన మురారి చిత్రం ఇటీవల రీరిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా ఆయన పలు ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఓ ఛానెల్‌తో మాట్లాడుతుండగా యాంకర్ చక్రం మూవీ పరాజయంపై ప్రశ్నించారు. పాన్ ఇండియా స్టార్‌గా వెలుగొందుతున్న ప్రభాస్ ఎక్కువగా యాక్షన్ , మాస్ ఓరియెంటెడ్ మూవీస్ చేశారు. ఈ దశలో వైవిధ్యం చూపించాలనే ఉద్దేశంతో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో చక్రం చేశారు.
ఓ వ్యాధి బారినపడి కొద్దిరోజుల్లో చనిపోయే హీరో.. తాను చనిపోతే తన ప్రేయసి జీవితం నాశనమవుతుందని భావించి కుటుంబానికి దూరంగా ఉంటాడు. ప్రేమ, మానవ సంబంధాల విలువ తెలియజేస్తూ చివరికి చనిపోతాడు. లవ్, ఎమోషనల్, ట్రాజెడీ ఎలిమెంట్‌తో వచ్చిన చక్రం విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద దారుణ పరాజయాన్ని చవిచూసింది. మాస్ ప్రేక్షకులు , అభిమానులు చివరిలో ప్రభాస్ చనిపోవడాన్ని తట్టుకోలేకపోయారు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ ఎంతోమందికి జీవితం విలువను నేర్పింది.
తాజా ఇంటర్వ్యూలో చక్రంలో హీరో చనిపోవడమే దెబ్బేసిందా అని యాంకర్ ప్రశ్నించగా దానికి కృష్ణవంశీ తనదైనశైలిలో ఆన్సర్ ఇచ్చారు. దేవదాసు, ప్రేమాభిషేకం వంటి సాడ్ ఎండింగ్స్‌తో వచ్చిన చాలా తెలుగు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయని ఆయన గుర్తుచేశారు. బహుశా చక్రం మూవీని తాను సరిగా డీల్ చేయలేకపోయానేమో తప్పించి ఎమోషన్ తప్పుకాదని కృష్ణవంశీ తెలిపారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











