Kalki 2898 AD: భయపడిపోయిన కల్కి టీమ్.. రిలీజుకు ముందే ఆ జాగ్రత్తలు
ఒక సినిమా పురుడు పోసుకోవడానికి ఎన్నో రోజులపాటు ఎంతో మంది శ్రమిస్తారు. రెండున్నర గంటల సినిమా కోసం ఏళ్ల తరబడి కష్టపడుతుంటారు. తీరా ఆ చిత్రం విడుదలయ్యాకా అది బాలేదు, ఇదేంటి అలా ఉంది అని ట్రోలింగ్ బారిన పడితే దానిపై అప్పటివరకు ఆశలు పెట్టుకున్న ప్రతి ఒక్కరికి మిగిలేది బాధే.
అందుకే విడుదలకు ముందే అన్ని రకాలుగా ఔట్ పుట్ ఎలా ఉందో ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోవాలి. ఇటీవల ఆదిపురుష్ సినిమాపై ఎంతటి ట్రోలింగ్ వచ్చిందో తెలిసిందే. దాన్ని దృష్టిలో పెట్టుకుని మళ్లీ అలాంటి తప్పు జరగకూడదన్న భయంతో 'కల్కి 2898 ఏడీ' డైరెక్టర్ ఏం చేశాడనే విషయంపై లుక్కేస్తే..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటి దీపికా పదుకొణె ప్రధాన పాత్రలు పోషించిన సినిమా 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD). మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తుండగా.. లోక నాయకుడు కమల్ హాసన్ ప్రతినాయకుడిగా అలరించేందుకు రెడీ అయిన విషయం తెలిసిందే.
ప్రాజెక్ట్ కె అనే వర్కింగ్ టైటిల్ తో ప్రచారం సాగిన కల్కి సినిమా టైటిల్ గ్లింప్స్ ను అమెరికాలోని శాన్ డియాగో కామిక్ కాన్ ఫెస్టివల్ లో విడుదల చేసిన విషయం తెలిసిందే. గ్లింప్స్ కంటే ముందుగా ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. కానీ ఆ లుక్ ప్రేక్షకులనే కాదు డార్లింగ్ అభిమానులను కూడా తెగ నిరాశపరిచింది. తెగ ట్రోలింగ్ కూడా జరిగింది. దాని నుంచి తేరుకున్న మూవీ టీమ్ ఆ పోస్టర్ డిలీట్ చేసి ఒరిజినల్ ప్రభాస్ లుక్ పోస్ట్ చేసింది. ఆ తర్వాత వచ్చిన కల్కి 2898 ఏడీ వీడియో గ్లింప్స్ నెగెటివిటీని పటాపంచలు చేసేసింది.

అయితే కల్కి 2898 ఏడి సినిమాపై వచ్చిన నెగెటివిటీ, గ్రాఫిక్స్, రివ్యూలన్నింటిపైనా దృష్టి సారించింది మూవీ టీమ్. అందులో భాగంగానే గ్లింప్స్ వీడియోలో గ్రాఫిక్స్ పై ఎలాంటి రివ్యూస్ వచ్చాయో డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్వయంగా పరిశీలిస్తున్నాడు. ఆయన రివ్యూలను, వీఎఫ్ఎక్స్ లను ఒకటికి పదిసార్లు తీక్షణంగా చూస్తున్న ఫొటోను తాజాగా నిర్మాత ప్రియాంక దత్ తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. దానికి టీజర్ వీఎఫ్ఎక్స్ రివ్యూస్ అని క్యాప్షన్ రాసుకొచ్చింది.
ఇటీవల ప్రభాస్ ఆదిపురుష్ సినిమాకు ఎలాంటి ట్రోలింగ్ జరిగిందో తెలిసిందే. ఆ భయంతోనే కల్కి 2898 ఏడి విడుదలకు ముందే ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు మూవీ టీమ్ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఈ సినిమాను వైజయంతీ నిర్మాణ సంస్థకు బాగా కలిసొచ్చిన తేది మే 9న (2024 సంవత్సరం) విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











