అలా జరిగితే మరోలా ఉండేది... పవన్, మహేష్, దేవరకొండ ప్లాపులపై నాగ్ అశ్విన్!
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్.. చేసింది రెండు సినిమాలే అయినా దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 2015లో వచ్చిన 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమైన నాగ్ అశ్విన్ తొలి సినిమాతోనే బ్రిలియంట్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
2018లో ప్రముఖ నటి సావిత్రి బయోపిక్ 'మహానటి' చిత్రం తీసిన మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. సినిమాను కమర్షియల్ కోణంలో కాకుండా కళాత్మక కోణంలో చూసే టెక్నీషియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నాగ్ అశ్విన్ తాజాగా తన ట్విట్టర్ పేజీలో చేసిన ట్వీట్ ఆసక్తిరేరెత్తిస్తోంది.

అలా జరిగి ఉంటే ఇండస్ట్రీ దిశ మరోలా ఉండేదేమో?
నేను కోరుకున్న తెలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించి ఉంటే.... ఇండస్ట్రీ దిశ మరోలా ఉండేదో? అంటూ నాగ్ అశ్విన్ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ బట్టి తెలుగు ప్రేక్షకులు మూడ్ ఎలా ఉందో చెప్పడంతో పాటు కొన్ని మంచి సినిమాలు ఆదరించే పరిస్థితి లేదని అభిప్రాయ పడ్డట్లు తెలుస్తోంది.
పవన్, మహేష్, దేవరకొండ ప్లాపు చిత్రాలపై
ఖలేజా, లీడర్, పంజా, ఆరెంజ్, అందాల రాక్షసి, డియర్ కామ్రేడ్ చిత్రాలు ఇంకా బాగా ఆడితే బావుండేది. ముఖ్యంగా ‘ఖలేజా' చిత్రం.... ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ అయి ఉంటే త్రివిక్రమ్ గారి నుంచి ఇంకా అద్భుతమైన చిత్రాలు వచ్చి ఉండేవి... అంటూ నాగ్ అశ్విన్ కామెంట్ చేశారు.
కామెంట్స్ మరోలా...
అయితే నాగ్ అశ్విన్ చేసిన ఈ ట్వీటపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొందరు ఆయన ట్వీట్‌తో ఏకీభవిస్తుండగా... మరొకొందరు విభేదిస్తున్నారు. మీరు చెప్పినట్లు ‘ఖలేజా' చిత్రం సూపర్ మూవీ అని కొందరు కామెంట్ చేయగా. ‘డియర్ కామ్రేడ్' చిత్రం మా సహనాన్ని పరీక్షించింది అని మరొకొందరు స్పందించారు.

నాగ్ అశ్విన్
‘మహానటి' తర్వాత నాగ్ అశ్విన్ తర్వాతి సినిమాపై ఇంకా ఎలాంటి అప్ డేట్ లేదు. త్వరలో అతడు విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై త్వరలనే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











