తెలంగాణ సర్కార్ సీరియస్ .. స్టార్ హీరోయిన్‌కు క్షమాపణలు చెప్పిన డైరెక్టర్
యాక్షన్, క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్‌లు మూవీలు చిత్ర పరిశ్రమను ముంచెత్తుతున్న దశలో కామెడీ సినిమాలు కనిపించడం లేదు. ఉన్న ఒకరిద్దరు దర్శకులు కూడా యాక్షన్ సినిమాల వైపు ఫోకస్ చేయడంతో కామెడీ టచ్ పోతోంది. ఇలాంటి దశలో టాలీవుడ్‌లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు త్రినాథరావు నక్కిన. కామెడీ, లవ్ సబ్జెక్ట్స్‌తో హిట్లు కొడుతూ నిర్మాతల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు.
2013లో ప్రియతమా నీవచట కుశలమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన త్రినాథరావు.. తర్వాత మేం వయసుకు వచ్చామ్, నువ్వలా నేనిలా, సినిమా చూపిస్తా మావా, నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే, ఇద్దరి లోకం ఒకటే, ధమాకా వంటి సినిమాలతో మంచి విజయాలు అందుకున్నారు. కామెడీకి, రొమాన్స్‌కు పెద్ద పీట వేస్తూ సక్సెస్ కొడుతున్నారు త్రినాథరావు. ఆయనతో సినిమాలు చేసేందుకు పలువురు స్టార్ హీరోలు కూడా ఆసక్తి చూపిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

దిల్‌రాజు - శ్రీముఖి వ్యాఖ్యలు , అల్లు అర్జున్ ఇష్యూ, మోహన్ బాబు కుటుంబంలో గొడవలు, జానీ మాస్టర్ అరెస్ట్, అంతకుముందు హేమ కేసు, రాజ్ - తరుణ్ లావణ్యల వ్యవహారంతో తెలుగు చిత్ర పరిశ్రమ పరువు పొగొట్టుకుంది. పరిస్ధితులు చక్కదిద్దాలని సినీ ప్రముఖులు భావిస్తున్నారు. ఇలాంటి దశలో త్రినాథరావు నక్కిన మరో వివాదానికి కారణమయ్యాడు. ఆయన దర్శకత్వంలో వస్తున్న సినిమా మజాకా. రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా.. రావు రమేశ్ తదితరులు కీలకపాత్ర పోషిస్తున్నారు. అన్నింటిలోకి అక్కినేని నాగార్జున మన్మథుడు సినిమాలో హీరోయిన్‌గా నటించిన అన్షు దాదాపు 23 ఏళ్ల తర్వాత మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నారు.
మజాకా సినిమా ఫిబ్రవరి 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇటీవల హైదరాబాద్‌లో టీజర్ లాంచ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో త్రినాథరావు మాట్లాడుతూ.. అన్షు సన్నగా ఉన్నారని, తెలుగు వాళ్లకి అలా ఉంటే నచ్చదని అన్నీ కొంచెం పెంచాలని చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. అక్కడితో ఆగలేదు.. హీరోయిన్ రీతూ వర్మ గురించి చెప్పబోతూ.. ఓ కార్యక్రమంలో అల్లు అర్జున్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు వెంటనే గుర్తుకురాక ఇబ్బంది పడ్డారు. ఆ సీన్‌ను ఇమిటేట్ చేసేలా మా సినిమాలో సెకండ్ హీరోయిన్.. తన పేరు.. అరే వాటర్ తీసుకురండి అంటూ కాస్త ఓవరాక్షన్ చేశాడు త్రినాథరావు.

సీనియర్ హీరోయిన్ అన్షు అంబానీపై దర్శకుడు త్రినాథరావు నక్కిన చేసిన అనుచిత వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమయ్యాయి. దీంతో తెలంగాణ మహిళా కమీషన్ యాక్షన్‌లోకి దిగింది. త్రినాథరావుకు కమీషన్ ఛైర్ పర్సన్ నేరెళ్ల శారద నోటీసులు ఇవ్వాలని భావిస్తున్నట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే నోటీసులు ఇవ్వడానికంటే ముందే త్రినాథరావు స్పందించారు. అన్షుతో పాటు నా వ్యాఖ్యల వల్ల బాధపడ్డ మహిళలందరికీ క్షమాపణలు చెప్పారు. తన ఉద్దేశం అది కాదని, అయినప్పటికీ అది తప్పేనని పెద్ద మనసుతో క్షమించాలని త్రినాథరావు ఓ వీడియో రిలీజ్ చేశారు. అలా మొత్తానికి త్రినాథరావు ఈ వివాదానికి స్వయంగా ఫుల్ స్టాప్ పెట్టడంతో చిత్ర పరిశ్రమ ఊపిరి పీల్చుకుంది.


Click it and Unblock the Notifications











